Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో మోడీ ఆ మాట అన్నారా?

By:  Tupaki Desk   |   8 Aug 2022 4:41 AM GMT
చంద్రబాబుతో మోడీ ఆ మాట అన్నారా?
X
ఢిల్లీలో జరిగిన ఒక ప్రోగ్రాం ( ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ )కు ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. తప్పనిసరిగా రావాలంటూ వచ్చిన ఫాలో అప్ ల మధ్య ఢిల్లీకి వెళ్లటం.. ఈ సందర్భంగా వచ్చిన వారిని వరుసగా నిలుచోబెట్టిన అనంతరం.. వరుసలో ఉన్న వారిని ప్రధాని నరేంద్ర మోడీ అందరిని పలుకరిస్తూ రావటం.. ఆ వరుసలో ఉన్న చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి ఐదు నిమిషాల పాటు మాట్లాడినట్లుగా కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

అందులో భాగంగా.. ''మీరు ఈ మధ్య ఢిల్లీకి రావటం లేదు. వస్తూ ఉండండి.. మనం చాలా రోజులైంది కలుసుకొని. మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది'' అంటూ ప్రముఖ మీడియా సంస్థల్లో ఈ తరహా వార్తలు రావటం.. అవి కాస్తా వైరల్ గా మారటం తెలిసిందే. తాము పేర్కొన్న అంశాలన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సమాచారం అందినట్లుగా చెబుతున్నారు. ఇక్కడ కలిగే సందేహం ఏమంటే.. ప్రధాని నరేంద్ర మోడీ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు మాత్రమే పక్కకు వెళ్లి మాట్లాడుకున్న విషయాలు మీడియాకు ఎలా తెలుస్తాయి? అన్నది ప్రశ్న.

దీనికి రెండు మార్గాలే ఉన్నాయి. అందులో మొదటిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాకు లీకులు ఇవ్వటం. అది జరిగే పనే కాదు. మిగిలిన మార్గం చంద్రబాబు తాము మాట్లాడుకున్న విషయాల్ని తెలుగు తమ్ముళ్లకు చెబితే.. వారు మీడియా సంస్థలకు చేరవేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ రెండో ఆప్షన్ కే ఎక్కువ అవకాశం ఉండి ఉండాలి. తమ మధ్య జరిగిన సంభాషణను చంద్రబాబు చెప్పినా.. దానికి కావాల్సినంత మసాలా జోడించి తెలుగు తమ్ముళ్లు చెప్పి ఉంటారని భావిస్తున్నారు.

ఇంతకీ చంద్రబాబుతో ప్రధాని మోడీ అన్న మాటల్లో అందరూ హైలెట్ చేస్తున్న మాటల్లో మొదటిది.. 'అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూ ఉండండి. ఇది మీ ఇల్లు అనుకోండి' అన్నది అయితే.. రెండోది.. 'మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది' అని చెప్పటం. నిజంగానే..ఈ మాటల్ని మోడీ అని ఉంటారా? అన్నది చూస్తే.. మొదటి మాట విషయానికి వస్తే.. అప్పట్లో డీఎంకే అధినేత కరుణను ఉద్దేశించి.. ఢిల్లీలోని తన నివాసంలో ఉండొచ్చన్న మాట చెప్పటం.. దీనికి పలువురు కన్న తల్లిని ఇంట్లో ఉంచుకోవు కానీ.. కరుణను మాత్రం ఉండమంటారా? అని విమర్శలు చేయటం తెలిసిందే.

నాటకీయంగా మాట్లాడటంలో మోడీకి మించినోళ్లు ఉండరు. ఆ విషయం అందరికి తెలిసిందే. కొందరు తెలుగు తమ్ముళ్లు అతిగా ప్రచారం చేసుకుంటున్నారంటూ విరుచుకుపడినా.. అదంతా కూడా వారు ఈ విషయాల్ని జీర్ణించుకోలేకపోవటమే అవుతుందని చెప్పక తప్పదు. ఒకవేళ ప్రధాని మోడీ నోటి నుంచి రాని మాటల్ని టీడీపీ వర్గాల నోటి నుంచి వచ్చి.. అవి పబ్లిష్ అయితే.. దాని కారణంగా అందరి కంటే ఎక్కువగా నష్టపోయేది చంద్రబాబే.

ఎందుకంటే.. ఇలా తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రముఖ పత్రికల్లో పబ్లిష్ కావటాన్ని ప్రధాని మోడీ సీరియస్ గా తీసుకుంటారని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ప్యాచప్ అవుతున్న వేళలో.. ఏ మాత్రం అతి దొర్లినా కూడా నష్టమే అవుతుందన్నది చంద్రబాబుకు తెలుసు. అలాంటి సమయంలోనూ ఇలాంటి వివరాలు బయటకు వచ్చాయంటే.. అందులో నిజాలే ఉండి ఉంటాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.