Begin typing your search above and press return to search.

ఢిల్లీలో చంద్రబాబుకు చెప్పిన మాటే పవన్ కు చెప్పిన మోడీ?

By:  Tupaki Desk   |   12 Nov 2022 4:49 AM GMT
ఢిల్లీలో చంద్రబాబుకు చెప్పిన మాటే పవన్ కు చెప్పిన మోడీ?
X
దాదాపు మూడు నెలల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు.. చేతలకు ఎంత తేడా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసే ఈ ఉదంతం చదివితే.. కాస్తంత క్లారిటీ రావటం ఖాయం.

ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంట్రల్ లో ఆజదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం జరిగింది. దీనికి పలువురు రాజకీయ నేతలతో పాటు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.ప్రధాన మంత్రి మోడీ కూడా ఈ ప్రోగ్రాంకు వచ్చారు.

ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రముఖుల వద్దకు వెళ్లిన నరేంద్ర మోడీ.. పేరు పేరును పలువురిని పలుకరించారు. ఆ కార్యక్రమానికి చంద్రబాబు కూడా హాజరయ్యారు. చంద్రబాబు వద్దకు వచ్చిన మోడీ.. ఆయన్ను పలుకరించటమే కాదు.. ఆయన్ను పక్కకు తీసుకెళ్లి.. ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడిన వైనం అప్పట్లో ఆసక్తికరంగానేకాదు.. కొత్త విశ్లేషణలకు తావిచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్న విషయానికి సంబంధించి భారీఎత్తున వార్తలు వచ్చాయి.

వాటిల్లో ఒక మాట చాలామందిని ఆకర్షించింది. అదేమంటే.. చంద్రబాబును ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. మనం కలిసి చాలా కాలమైంది. మీకు కుదిరినప్పుడు కలవొచ్చు కదా? ఇకపై తరచూ కలుసుకుందామని చంద్రబాబుతో మోడీ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇది జరిగి.. మూడు నెలలు అయ్యింది. చంద్రబాబుకు మోడీ నుంచి పిలుపు వచ్చింది లేదు.. ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసింది లేదు

తాజాగా ఆయన విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా కలవాలనుకుంటే చంద్రబాబును కలవాల్సిందిగా ఆయన చెప్పొచ్చు. కానీ.. అలాంటి ఆహ్వానం ఆయనకు రాలేదు. అదే సమయంలో.. భేటీ ఇన్విటేషన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వచ్చింది. వీరిద్దరి మధ్య నలబై నిమిషాల పాటు భేటీ జరిగింది. భేటీలో భాగంగా జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మనం తరచూ కలుసుకుందా’ అన్న మాట చెప్పినట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీ నుంచి ఆ మాట రావటంపై జనసైనికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. తనను కలిసిన ప్రతి ముఖ్యుడితో ప్రధాని నోటి నుంచి ఆ మాటల క్యాజువల్ గా వస్తుందని చెప్పాలి. దానికే.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన అవసరం లేదన్న విషయాన్ని జనసైనికులు అర్థం చేసుకుంటే మంచిందంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.