Begin typing your search above and press return to search.

కోర్టుకే నిమ్మగడ్డ ఎదురుతిరిగారా ?

By:  Tupaki Desk   |   21 March 2021 6:50 AM GMT
కోర్టుకే నిమ్మగడ్డ ఎదురుతిరిగారా ?
X
అవసరం ఉన్నపుడు ఓడ మల్లన్న.. అవసరం తీరిపోయాక బోడి మల్లన్న అన్న సామెతలాగుంది స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. పరిషత్ ఎన్నికల నిర్వహణపై కోర్టు విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటీషన కు సమాధానమివ్వాలని కోర్టు ఎన్నికల కమీషనర్ కు ఆదేశాలు జారీచేసింది. దాంతో కమీషనర్ తరపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.

పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఎందుకు ఆలస్యమవుతోందనే విషయాన్ని ప్రస్తావించకుండా అసలు కమీషనర్ నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకునేందుకు లేదని వాదించటమే విచిత్రంగా ఉంది. ఎలక్షన్ కమీషనర్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు, పరిశీలించేందుకు లేదన్నారు. ఒకవేళ కోర్టులు పరిశీలించాలని అనుకుంటే అది ఎన్నికల కమీషన్ స్వతంత్రతలో జోక్యం చేసుకోవటమే అని అభ్యంతరం తెలిపటమే ఆశ్చర్యంగా ఉంది.

ఆగిపోయిన ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కమీషన్ ఇంకా నిర్ణయించలేదన్నారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం పూర్తిగా కమీషన్ దే అని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల కమీషన్ న్యాయవాది వాదనలు విన్న కోర్టు మండిపడింది. ఎన్నికల కమీషన్ అధికారాలకు పరిమితులు లేవని కమీషనర్ భావిస్తున్నారా ? అంటు నిలదీసింది. తనకున్న విచక్షణాధికారాలను కమీషనర్ ఎలా ఉపయోగించాలో అలా మాత్రమే ఉపయోగించాలని కోర్టు గుర్తుచేసింది.

కమీషన్ తీసుకున్న నిర్ణయాలు కోర్టుల సమీక్షకు లోబడి ఉండవా అంటూ గట్టిగా నిలదీసింది. దాంతో ఏమి చెప్పాలో కమీషన్ లాయర్ కు అర్ధంకాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పంచాయితి ఎన్నికలు అయిపోగానే వెంటనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశారు. మరి మున్సిపల్ ఎన్నికలైపోయి సుమారు 10 రోజులవుతున్నా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయాలేదన్నదే అనుమానం.

ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వానికి తనకు వివాదం మొదలైనపుడు కానీ తర్వాత కానీ ప్రతిచిన్న విషయంలోను నిమ్మగడ్డ ఎన్నిసార్లు కోర్టును ఆశ్రయించారో అందరికీ తెలిసిందే. తన అధికారాలను ప్రభుత్వం గుర్తించటం లేదని చీటికి మాటికి ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ కోర్టుకీడ్చారు. ఇపుడు తన అధికారాలను కోర్టులు ప్రశ్నించేసరికి నిమ్మగడ్డ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే తన అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకునేందు లేదని తెగేసి చెబుతున్నారు. అంటే తన నిర్ణయాలను, అధికారాలను కోర్టులు ప్రశ్నించేందుకు లేదన్న మాటను నిమ్మగడ్డ స్పష్టంగానే చెప్పారు. దీంతోనే కోర్టుకు మండిపోయి బాగా అక్షింతలు వేసింది. మరి తర్వాత విచారణలో ఏమి చేస్తారో చూడాలి.