Begin typing your search above and press return to search.

పార్టీ మార్పు అక్కాతమ్ముళ్ల మధ్య వార్ కు దారితీసిందా?

By:  Tupaki Desk   |   5 July 2022 11:30 PM GMT
పార్టీ మార్పు అక్కాతమ్ముళ్ల మధ్య వార్ కు దారితీసిందా?
X
రాజకీయంలో ఎదుగుదల తప్ప.. ఒదుగుదల ఉండదు.. నిన్నటి వరకూ మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి ఏకంగా మహారాష్ట్రకే సీఎం అయ్యారు. పార్టీ మార్పుతో.. లాలూచీ వ్యవహారాలతో రాత్రికి రాత్రే దశ మారిపోయే వారు ఎందరో ఉంటారు. అనాదిగా టీఆర్ఎస్ లో ఉండి టికెట్ లభించక.. మేయర్ పీఠం కూడా దూరం కావడం.. అవకాశాలు లభించకపోవడంతో విసిగి వేసారిన ఓ మహిళ నేత పార్టీ మారింది. ఎమ్మెల్యే టికెట్ హామీతో కాంగ్రెస్ లో చేరింది. టీఆర్ఎస్ కు షాకిచ్చింది. అధికార పార్టీ నుంచి జంప్ అయ్యింది. ఈమె మార్పు దెబ్బకు సొంత అన్నయ్య సీటుకే ఎసరు వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతిరోజు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండాలి. వివాదాలతోనే పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. వివాదాలు లేకపోతే పార్టీకి పూట గడిచేలా లేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ కోసం అక్కా తమ్ముళ్ల మధ్యే వార్ మొదలైనట్లైంది. దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ కూతురు.. ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు అయిన విష్ణువర్ణన్ రెడ్డికి విజయ స్వయానా అక్క. వీళ్లద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినా చెరో పార్టీలో ఉన్నారు. ఇన్నాళ్లు ఈ సమస్య రాలేదు. అయితే కొంతకాలంగా విష్ణు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనపడడం లేదు. పార్టీలోని సీనియర్లతో కూడా అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. ఒక విధంగా పార్టీ తరుఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్నారా? లేదా అన్న అనుమానం పార్టీలోనే ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే విజయ పార్టీలో చేరారు. బహుశా వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయమై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లున్నారు. అందుకనే ఆమె పార్టీలో చేరారు. ఎప్పుడైతే అక్క పార్టీలో చేరారో వెంటనే తమ్ముడి సీటుకు ఎసరు వచ్చింది. తాను పార్టీలో ఉండగా తన సోదరిని ఎందుకు చేర్చుకున్నారు.. తనకు చెప్పకుండా చేర్చుకోవడం ఏమిటంటూ ఇప్పుడు రేవంత్ పై మండుతున్నాడు. అసలు విష్ణు తొందరలోనే టీఆర్ఎస్ లో చేరిపోతారనే ప్రచారం జరిగినా దాన్ని ఆయన ఖండించలేదు. దాంతో ముందుజాగ్రత్తగా రేవంత్ ఏకంగా కార్పొరేటర్ విజయను పార్టీలోకి తీసుకున్నారు. దాంతో ఇప్పుడు అక్కా-తమ్ముళ్ల మధ్యే గొడవలు మొదలయ్యాయి.

అసలు వీళ్లిద్దరికీ చాలా కాలంగా మాటలు కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడేమైదంటే విజయకు మద్దతుగా రేవంత్ నిలబడ్డారు. ఇదే సమయంలో విష్ణుకు మద్దతుగా సీఎల్పీ నేత భట్టి, మరికొందరు అండగా నిలిచారు. దాంతో ముందు ముందు ఈ వివాదం బాగా ముదిరినట్టే కనపడుతోంది.