Begin typing your search above and press return to search.

పవన్‌ వారి ఓట్లపైనే ప్రధానంగా కన్నేశారా?

By:  Tupaki Desk   |   15 Dec 2022 6:30 AM GMT
పవన్‌ వారి ఓట్లపైనే ప్రధానంగా కన్నేశారా?
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఆయన చాలా చురుగ్గానే రాజకీయాలు చేస్తున్నారు. ఓవైపు జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సొంత నిధులను అందజేశారు. అలాగే జనవాణి పేరుతో అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించే కార్యక్రమానికి సైతం పవన్‌ శ్రీకారం చుట్టారు.

మరోవైపు సంక్రాంతి తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారాహి పేరుతో బస్సు సిద్ధమైంది. దానికి తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ సైతం పూర్తయిపోయింది.

మరోవైపు బస్సు యాత్ర కంటే ముందే శ్రీకాకుళం జిల్లా నుంచి తన కార్యక్రమాలను జనసేనాని మొదలుపెట్టబోతున్నారు. తనకు హీరోగా ఉన్న లక్షలాది మంది యువకుల అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి పవన్‌ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో హీరోగా తనను అభిమానించేవారు సైతం జగన్‌ కు ఓటేసినట్టు స్వయంగా పవనే చెప్పారు. యువకుల ఓట్లను తన పార్టీ వైపు మళ్లించుకోగలిగినట్టయితే జనసేన గత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేదన్న అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా పవన్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనను అభిమానిస్తున్న లక్షలాది మంది యువత ఓట్లను పూర్తిగా జనసేన వైపు మళ్లించేలా జనవరి 12న యువశక్తి పేరుతో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో భారీ బహిరంగ సభకు పవన్‌ సిద్ధమవుతున్నారు. కేవలం ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ యువశక్తి సభలను నిర్వహించి పెద్ద ఎత్తున యువతను పార్టీలోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే తనను హీరోగా అభిమానిస్తున్న యువత ఓట్లను వచ్చే ఎన్నికల్లో పూర్తిగా జనసేన వైపు మళ్లించాలని పవన్‌ పిలుపు నిస్తారని చెబుతున్నారు.

ఇప్పటికే యువశక్తి బహిరంగ సభలకు సంబంధించిన పోస్టర్‌ ను సైతం జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ ఆవిష్కరించారు. గతంలో జనసేన ముఖ్య నేత నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించి పార్టీ స్థితిగతులను తెలుసుకున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్‌ సైతం ఇటీవల ఉత్తరాంధ్రలో నియోకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు సేకరించారు.

వాస్తవానికి ఉత్తరాంధ్రలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారు. దాదాపు పవన్‌ కల్యాణ్‌ ప్రతి సినిమాలోనూ శ్రీకాకుళం జానపదాలు, మాండలికంపై చిన్న చిన్న పాటలు సర్వసాధారణం. ఉత్తరాంధ్ర సంస్కృతి, జానపదాలు, మాండలికంపై పవన్‌ కు అభిమానమూ ఎక్కువేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభను జనవరి 12న శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో పవన్‌ నిర్వహించనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.