Begin typing your search above and press return to search.

టీడీపీ, బీజేపీల‌కు ప‌వ‌న్ షాక్ ఇచ్చిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:29 AM GMT
టీడీపీ, బీజేపీల‌కు ప‌వ‌న్ షాక్ ఇచ్చిన‌ట్టేనా?
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ టీడీపీ, బీజేపీల‌కు షాకిచ్చిన‌ట్టేనా అంటే అవున‌నే అంటున్నారు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. తాజాగా బాప‌ట్ల జిల్లా ప‌ర్చూరులో జ‌రిగిన జ‌న‌సేన పార్టీ కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ఎవ‌రితోనూ పొత్తులు లేవ‌ని.. త‌న పొత్తులు ప్ర‌జ‌ల‌తోనేన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. తాను సీబీఎన్ (చంద్ర‌బాబు నాయుడు)కి ద‌త్త పుత్రుడిని కాద‌ని.. తాను సామాన్య ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ద‌త్త‌పుత్రుడ‌నని ప‌వ‌న్ అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఎవ‌రితోనూ పొత్తులు లేవ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించడం బీజేపీ, టీడీపీల‌కు షాకేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన జ‌న‌సేన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో పొత్తుల గురించి మాట్లాడుతూ ప‌వ‌న్ త‌న ముందు మూడు ఆప్ష‌న్లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు.

బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం, బీజేపీ-టీడీపీతో క‌ల‌సి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం, జ‌నసేన సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం త‌న ఆప్ష‌న్ల‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ పొత్తుల ప్ర‌క‌ట‌న‌ల‌పై ఆ రెండు పార్టీలు స్పందించ‌లేదు. మౌన ముద్ర దాల్చాయి. టీడీపీ సీనియ‌ర్ నేత‌లు, దిగువ స్థాయి నేత‌ల‌యితే త‌మ‌కు ఎవ‌రితోనూ పొత్తు అవ‌స‌రం లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ సొంతంగా పోటీ చేస్తుంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు కూడా చేశారు.

ఇక బీజేపీ అయితే ప‌వ‌న్ కు ఓ ర‌కంగా షాక్ ఇచ్చిందని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఎక్క‌డా జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యం ప్ర‌స్తావించ‌లేదు. జ‌న‌సేన‌తో త‌మ‌కు పొత్తు ఉంద‌న్న విష‌యాన్ని మాట మాత్రం ఎత్త‌లేదు.

వాస్త‌వానికి త‌మ కూట‌మి అభ్య‌ర్థిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా జేపీ న‌డ్డా ప్ర‌క‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు. పైగా జేపీ న‌డ్డా రాజ‌మహేంద్ర‌వ‌రం స‌భ‌లో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సొంతంగా అధికారంలోకి రావాల‌ని .. ఇందుకోసం కార్య‌క‌ర్త‌లంతా క‌ష్ట‌ప‌డాల‌ని సూచించారు.

దీంతో బీజేపీ, టీడీపీల ఉద్దేశ‌మేమిటో అర్థ‌మ‌యిన ప‌వ‌న్ త‌న తాజా ప‌ర్చూరు ప‌ర్య‌ట‌న‌లో ఆ రెండు పార్టీల‌కు తీవ్ర షాకిచ్చార‌ని చెబుతున్నారు. త‌మ‌కు ఎవ‌రితోనూ పొత్తులు లేవ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఆ రెండు పార్టీల గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ పడింద‌ని అంటున్నారు. ప‌వ‌న్ తాము చెప్పిన ష‌ర‌తుల‌కు ఒప్పుకుని.. తాము ఇచ్చిన ఒక‌టో, అరో సీట్లు తీసుకుంటారో అనుకుంటే.. జ‌న‌సేన‌కు ఎవ‌రితోనూ పొత్తులు లేవ‌ని తీవ్ర షాకే ఇచ్చార‌ని అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నార‌ని చెబుతున్నారు.