Begin typing your search above and press return to search.

బీజేపీ సహకారం అవసరం లేదని తేల్చేశారా ?

By:  Tupaki Desk   |   18 Oct 2022 4:17 AM GMT
బీజేపీ సహకారం అవసరం లేదని తేల్చేశారా ?
X
వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయటంలో తనకు ఢిల్లీ బీజేపీ పెద్దల సహకారం అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చేశారా ? మీడియాతో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇదే అర్ధం వినిపిస్తోంది. మంగళగిరి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై తాను చేయాలని అనుకుంటున్న పోరుకు ఢిల్లీ బీజేపీ పెద్దల సహకారం కోరేదిలేదని చెప్పారు. ప్రతి దానికి అమ్మా, అయ్యా అంటు నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గరకు ఏమివెళ్తాం అని ఎదురు ప్రశ్నించారు.

ఇది నా రాష్ట్రం, నా నేల నేనే వైసీపీతో తేల్చుకుంటానని పవన్ స్పష్టంచేశారు. వైసీపీ అదిలిస్తేనో లేకపోతే బెదిరిస్తేనో భయపడే వ్యక్తిని కానని చెప్పారు. తాను నేరస్తుల పాలనలో ఉండకూడదని అనుకుంటున్నట్లు పవన్ చెప్పారు. అలాగే వైసీపీ లేని ఏపీని చూడటమే తన లక్ష్యంగా పవన్ చెప్పుకున్నారు. వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం తనకు చేతకాకపోతే కదా ఢిల్లీ పెద్దల సాయాన్ని కోరాల్సింది అని ప్రశ్నించారు.

మొత్తానికి ప్రభుత్వంపై పోరాటానికి ఢిల్లీ బీజేపీ పెద్దల సాయాన్ని తీసుకోవటం పవన్ కు ఇష్టం లేదని అర్ధమైపోయింది. పనిలో పనిగా రాష్ట్రంలోని బీజేపీ నేతల మద్దతును కూడా పవన్ కోరుకోవటం లేదు. కమలనాదులే తమంతట తాముగా వచ్చి మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక నుండి తమ రెండు పార్టీలు ఐక్యఉద్యమాలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రతిపాదించారు. మరి వీర్రాజు ప్రతిపాదనకు పవన్ ఎలా స్పందించారో తెలీలేదు.

ఎందుకంటే పేరుకు మిత్రపక్షాలే అయినా జనసేన, బీజేపీలు ఏరోజు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసింది లేదు. రెండుపార్టీలు దేనికదే నిరసనలు, ఆందోళనలు చేస్తున్నాయి. ఇందుకనే మిత్రపక్షాలు ఏరోజైనా విడిపోవటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

జనసేన నిర్వహించిన సభల్లో బీజేపీని ఎప్పుడూ ఆహ్వానించలేదు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభల్లో పవన్ ఎక్కడా కనబడలేదు. మరి పవన్ మనసులో ఏముందో తెలీదుకానీ ఢిల్లీ పెద్దల సహకారం అవసరం లేదని చెప్పటమే ఇప్పుడు చర్చకు దారితీసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.