Begin typing your search above and press return to search.

రాజీవ్ గాంధీపై మోడీ చెప్పింది అబద్ధమేనా?

By:  Tupaki Desk   |   24 July 2019 1:07 PM GMT
రాజీవ్ గాంధీపై మోడీ చెప్పింది అబద్ధమేనా?
X
ఇండియా టుడే మేగజైన్ 1988 జవనరి ఇష్యూలో ఒక కథనం ప్రచురించింది. ఆ కథనంలో ఏముందంటే... అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక ఐఎన్ ఎస్ విరాట్ ను తన పర్సనల్ ట్రిప్ కు పది రోజులు వాడుకున్నారని అందులో రాసింది. అదే కథనాన్ని మే 9వ తేదీని 2019లో ఎన్నికల ముందు మళ్లీ పబ్లిష్ చేసింది. మరి అపుడు ఈ వార్తను ఇండియా టుడే ఎందుకు రీ పబ్లిష్ చేసిందో తెలియదు. కానీ దానిని ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న మోడీ ట్విట్టరులో షేర్ చేసి ’’చూశారా మన రాజవంశీకులు (రాజీవ్ గాంధీ ఫ్యామిలిని ఉద్దేశిస్తూ) యుద్ధ నౌకను ట్యాక్సీలా వాడుకున్నారు‘‘ అంటూ ట్వీట్ చేశారు.

దాంతో మోడీ పొందాల్సిన పబ్లిసిటీ పొందారు, కాంగ్రెస్ కు చేయాల్సిన డ్యామేజీ చేశారు. కానీ అపుడు ఆర్టీఐకి దరఖాస్తు చేయాల్సిన ఆ పత్రిక తాజాగా సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని ’ఐఎన్ ఎస్ విరాట్‘ను ఎవరెవరు హాలీడే కోసం వాడారు అని దరఖాస్తు చేసింది.

దీనిపై నేవీ సమాధానాలతో స్పందించింది. ‘తన వ్యక్తిగత అవసరాల కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ గాంధీ ఉపయోగించలేదని స్పష్టంచేస్తూనే... 1987 డిసెంబరు 28న ప్రధాని హోదాలో ఐఎన్ ఎస్ విరాట్ లో రాజీవ్ గాంధీ తన సతీమణి సోనియాతో కలిసి లక్షద్వీపు వరకు ప్రయాణించారని - మరుసటి రోజు డిసెంబరు 29న లక్షద్వీపులలో దిగిపోయారని’’ నేవీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఎంతటి వారికనా యుద్ధ నౌకలను వ్యక్తిగత అవసరాల కోసం భారత నేవీ ఇవ్వదని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

అయితే, వారిద్దరితో పాటు ఎవరెవరు ప్రయాణించారు అనే సమాచారం భారత నేవీ వద్ద భద్రపరచలేదని అందులో పేర్కొంది. మొత్తానికి ఇండియా టుడే చేసిన ఈ దరఖాస్తుతో మోడీ తాను ప్రధాని (ఆపద్ధర్మ) హోదాలో ఉండి... ఖరారు చేసుకోకుండా ఒక అబద్ధాన్ని ఎలా షేర్ చేశారు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. తెలుసుకునే అవకాశం ఉన్నా కూడా ఒక బీజేపీ నేత హోదాలో పార్టీకి లాభదాయకం అని ఆరోజు మోడీ దానిని షేర్ చేసి విసృతంగా ప్రచారం చేయమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి ఉంటారు. ఎంతయినా... భారత నేవీని తక్కువ చేసే అలాంటి ట్వీట్ ఒకటి ప్రధాని హోదాలో ప్రచారం చేయడం సరైనది కాదనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. తాజా సమాధానంతో నరేంద్రమోడీ, బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఇక్కడ ప్రస్తావనార్హం.