Begin typing your search above and press return to search.

ఆ సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌పైన టీడీపీ దృష్టి పెట్టిందా?

By:  Tupaki Desk   |   1 Aug 2022 9:33 AM GMT
ఆ సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌పైన టీడీపీ దృష్టి పెట్టిందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక కులాన్ని అణ‌గ‌దొక్కాల‌నే ల‌క్ష్యంతో పాల‌న సాగిస్తున్నార‌ని ఎప్ప‌టి నుంచో విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు కులాన్ని అన్ని ర‌కాలుగా జ‌గ‌న్ ఈ మూడేళ్ల‌లో అణ‌చివేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో స్పీక‌ర్ గా ప‌నిచేసిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు నుంచి మొద‌లుపెడితే సంగం డెయిరీ వ్య‌వ‌హారంలో ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్, మైనింగ్ వ్య‌వ‌హారంలో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, పోల‌వ‌రంలో అక్ర‌మాలంటూ దేవినేని ఉమా, వివిధ కేసులంటూ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్, ప‌రిశ్ర‌మ‌లో కాలుష్యం అంటూ గ‌ళ్లా జ‌య‌దేవ్ ఇలా టీడీపీలో ఉన్న క‌మ్మ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అణ‌చివేత చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని చెబుతున్నారు.

అయితే చంద్ర‌బాబు మాత్రం రెడ్డి నేత‌ల‌ను తన పార్టీలో చేర్చుకోవ‌డంపై దృష్టిపెట్టార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, రాయ‌ల‌సీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నార‌ని అంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా త‌మ‌కు ఏ మేలూ చేకూర‌లేద‌నేది వారి అభిప్రాయంగా ఉంద‌ని పేర్కొంటున్నారు.

వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు త‌మ సామాజిక‌వ‌ర్గానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రాధాన్యం ల‌భించింద‌ని రెడ్డి నేత‌లు అంటున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లో రెడ్డి నేత‌ల‌పై చంద్ర‌బాబు దృష్టి సారించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, అనంత‌పురంలో జేసీ ప్ర‌భాక‌ర‌రెడ్డి, దివాక‌ర్ రెడ్డి సోద‌రులు, క‌ర్నూలు జిల్లాలో కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కుటుంబం, చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి త‌దిత‌రులు టీడీపీలోనే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో త‌మ పార్టీలో రెడ్డి నేత‌ల‌ను మ‌రింత పెంచేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి (నెల్లూరు జిల్లా), మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి (ప్ర‌కాశం జిల్లా)తోపాటు ఎంపీలుగా ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర‌రెడ్డి (నెల్లూరు), మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి (ఒంగోలు), అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహ‌న్ రెడ్డి, డీఎల్ ర‌వీంద్రారెడ్డి, మైసూరా రెడ్డి, రామ‌సుబ్బారెడ్డిల‌ను టీడీపీలోకి తెచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు.

అలాగే ఇటీవ‌ల ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కుమార్తె కైవ‌ల్యా రెడ్డి ఇటీవ‌ల మ‌హానాడు నిర్వ‌హించిన‌ప్పుడు ఒంగోలులో నారా లోకేష్ తో స‌మావేశ‌మ‌య్యారు. అలాగే నెల్లూరు జిల్లా నుంచి ఆనం వెంక‌ట ర‌మ‌ణారెడ్డి టీడీపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌లోపు ఈ చేరిక‌ల‌ను మ‌రింత ప్రోత్స‌హించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.