Begin typing your search above and press return to search.

ఆ పొరపాటే జాక్ మా జీవితాన్ని మార్చేసిందా..?

By:  Tupaki Desk   |   5 Nov 2021 10:33 AM GMT
ఆ పొరపాటే జాక్ మా జీవితాన్ని మార్చేసిందా..?
X
జాక్ మా.. చైనాకు చెందిన ఈ ఆర్థిక వేత్త పేరు కొన్ని నెలల కిందట మారుమోగింది. తాజాగా మరోసారి ఆయన గురించి చర్చ మొదలైంది. 37 బిలియన్ డాలర్ల సమీకరణే లక్ష్యంగా ముందుకెళ్లిన ఈయన ప్రస్తుతం నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయనపై చైనా ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలు విధించడంతో దూకుడు స్వభావాన్ని తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పంట పొలాల్లో తిరుగుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుక జాక్ మా ఐరోపాలో పర్యటిస్తున్నట్లు సమాచారం. అయితే జాక్ మా కు ఈ పరిస్థితి రావడానికి ఓ మిస్టేక్ చేశారట. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిందని అనుకున్నారు. ఓ చిన్న పొరపాటు తన ఆర్థిక పేకమేడ కూలిపోయేలా చేసిందని అనుకుంటున్నారు.

అలీబాబా సహా వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ అధినేత అయిన జాక్ మా కు 2016-2017 సంవత్సరంలో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన షేర్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ సమయంలో తన ఆర్థిక వ్యవహారాలను మరింతగా విస్తరించేందుకు పలు దేశాల్లో పర్యటించారు. అనేక దేశాధినేతలను నేరుగా కలిశారు. పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులను కలిశారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కూడా 2017లో కలిశారు. ఆయన కలిసిన తరువాత తమ పెట్టుబడుల ద్వారా అమెరికాలో 10 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని తెలిపాడు.

అయితే జాక్ మా ఇతర దేశాల్లో పర్యటించి, వివిధ దేశాధినేతలను కలిసే విషయాన్ని సొంత దేశాధినేత జిన్ పింగ్ కు చెప్పలేదు. అంతేకాకుండా జిన్ పింగ్ అనుమతి తీసుకోకుండానే ఇతర దేశాధినేతలను కలుస్తూ వచ్చారు. దీంతో చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయాన్ని జిన్ పింగ్ బృందం జాక్ మాకు అప్పట్లోనే తెలియజేశారట. అయినా జాక్ మా పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు. పైగా గత అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వాసులు ఉద్యోగాలు కోల్పోవడానికి చైనానే కారణమని ఆరోపించారు. అమెరికా చేసిన ఈ ఆరోపణ చైనాకు కోపం తెప్పించింది.

ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా ప్రభుత్వంపై జాక్ మా పలు ఆరోపణలు చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు వ్యాపారాలు మానుకోవాలని అన్నారు. విస్తృతంగా సేవలు చేయాలని విమర్శలు చేశారు. దీంతో చైనా ప్రభుత్వం జాక్ మా పై ఆగ్రహం చెందింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై ఆంక్షలు విధించింది. యాంట్ ఫైనాన్షియల్ జీవోలను అడ్డుకుంది. యాంట్ గ్రూప్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డారని గతేడాది ఏప్రిల్ లో 2.75 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇక యాంట్ గ్రూప్ సంస్థపై నే కాకుండా పలు ప్రైవేట్ సంస్థలపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గేమింగ్, విద్య, క్రిప్టో కరెన్సీ తదితరవి జిన్ పింగ్ ప్రభుత్వ లక్ష్యాలకు అడ్డుగా మారడంతో వాటిపై ఆంక్షలు విధించింది.

జాక్ మాపై చైనా ఆంక్షలు విధించిన తరువాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. మునపటిలా కాకుండా నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ఒకప్పుడు చైనా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోయిన జాక్ మా ఇప్పుడు యాంట్ గ్రూప్ సంస్థల లక్ష్యాలను జిన్ పింగ్ సన్నిహితులకు వివరించేందుకు అనుమతులు కోరాడట. ఇక ఈ ఏడాది జిన్ పింగ్ కు నేరుగా లేఖ కూడా రాశాడట. ఇకపై తన జీవితం మొత్తాన్ని చైనాలోని గ్రామీణ అభివృద్ధికే అంకితం చేస్తానని ప్రకటించాడట. ఇందులో భాగంగా జాక్ మా వ్యవసాయంలో నూతన పద్ధతులను తెలుసుకునేందుకు యూరప్ లో పర్యటిస్తున్నాడు.