Begin typing your search above and press return to search.

ఇక డిజిట‌ల్ మీడియాను కేంద్రం ల‌క్ష్యంగా చేసుకుందా?

By:  Tupaki Desk   |   16 July 2022 3:29 AM GMT
ఇక డిజిట‌ల్ మీడియాను కేంద్రం ల‌క్ష్యంగా చేసుకుందా?
X
ఇప్పుడు దేశంలో ప్ర‌ధాన మీడియా.. ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాలు ఆయా పార్టీల‌కు కొమ్ము కాస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో ఆయా ప‌త్రిక‌ల‌ను, న్యూస్ చానెళ్ల‌ను ప్ర‌జ‌లు అంత‌గా న‌మ్మ‌డం లేదంటే అతిశ‌యోక్తి కాదు. నిజాల నిర్ధార‌ణ‌కు, ఏది వాస్త‌వ‌మో, అవాస్త‌వ‌మో తెలుసుకోవ‌డానికి సోష‌ల్ మీడియా (ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, ఇన‌స్టాగ్రామ్ త‌దిత‌ర‌), డిజిట‌ల్ మీడియా (న్యూస్ వెబ్ సైట్లు, య్యూటూబ్ చాన‌ళ్లు) పైనే ఆధార‌ప‌డుతున్నారు. వీటిని చూసే నిజ‌మేదో నిర్ధారించుకుంటున్నారు.

అందులోనూ ఇంట‌ర్నెట్ ఇప్పుడు కొండ ప్రాంతాల్లోనూ వ‌స్తుండ‌టం, దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ స్మార్ట్ ఫోన్లు వాడుతుండ‌టంతో సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియాకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ముందుగా సోష‌ల్ మీడియాను నియంత్రించడానికి చ‌ర్య‌లు చేప‌ట్టిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప‌లు చ‌ట్టాలు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు డిజిట‌ల్ మీడియాపై క‌త్తి క‌ట్టింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉండ‌కుండా, ఆ ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించ‌కుండా ఉండేందుకే డిజిట‌ల్ మీడియాపై క‌త్తి గ‌డుతున్నార‌నే వార్త‌లు ఆందోళ‌న పెంచుతున్నాయి. ఇది రాజ్యాంగం క‌ల్పించిన భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛా హ‌క్కును హ‌రించ‌డ‌మేనంటూ నిపుణులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కేంద్రంలో ప్ర‌ధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వ‌యం అత్యంత శ‌క్తివంతంగా ఎదిగారు. ప్ర‌ధాని మోడీ ప్ర‌పంచంలోనే శ‌క్తివంత‌మైన నేత‌ల్లో ఒక‌రిగా ఉన్నార‌ని ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి. ఈ నేప‌థ్యంలో వీరికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు ఇవ్వ‌డానికి దాదాపు అన్ని ప‌త్రిక‌లు, న్యూస్ చానెళ్లు వెనుకంజ వేస్తున్నాయి. త‌మ‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసేవారిని వివిధ సెక్ష‌న్ల కింద అరెస్టు చేయించ‌డం, రాజ‌ద్రోహం ముద్ర వేయ‌డం వంటివి చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియా చేయ‌లేని ప‌నిని సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియా చేస్తుంటే మోడీ ప్ర‌భుత్వం త‌ట్టుకోలేక‌పోతోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే డిజిట‌ల్ మీడియాను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. డిజిట‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్తా క‌థ‌నాలు, స‌మాచారం త‌ప్పని రుజువు అయితే సంబంధిత డిజిట‌ల్ మీడియా సంస్థ‌ల రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేయ‌డం లేదా జ‌రిమానా విధిస్తారు. ఇందుకు అవ‌కాశం క‌ల్పించేలా చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లును కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ సిద్ధం చేసింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

జూలై 18 నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల్లోనే డిజిట‌ల్ మీడియా నియంత్ర‌ణ బిల్లును ఆమోదిస్తార‌ని అంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం బిల్లును ఆమోదిస్తే... మొద‌టిసారిగా డిజిటల్‌ న్యూస్ మీడియా నమోదు చట్టంలోకి వ‌స్తుంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే డిజిటల్‌ న్యూస్ అందించేవారికి ఆంక్షలు తప్పవు. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు.. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ వెబ్‌సైట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.