Begin typing your search above and press return to search.

ఆ చిట్టి చిట్టి కుందేలు... దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు చేశాయా?

By:  Tupaki Desk   |   10 May 2022 1:30 AM GMT
ఆ చిట్టి చిట్టి కుందేలు... దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు చేశాయా?
X
కుందేళ్లు.. ఈ పేరు వినగానే మన మెదిలేది తెల్లటి అందమైన, అమాయకమైన రూపం. పొడవు చెవులతో చిట్టి చిట్టి పరుగులు తీసే సాధు జీవులు ఒకానొక సమయంలో ఓ దేశాన్నే గజగజ లాడించాయట. ఏంటీ కుందేళ్లు.. అంతలా చేశాయా... ఇదంతా ఉచ్చ ముచ్చటే అనుకుంటున్నారా..! అవునండీ... అదే నిజం. కుందేళ్ల దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయిందట. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే ఈ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కుందేళ్లు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకోవాలంటే... చరిత్ర పుటల్లోని కొన్ని పేజీలను వెనక్కి తిరగేయాలి. 20వ శతాబ్దం కాలం నాటి రోజుల్లో ఆస్ట్రేలియా లో.. కుందేళ్ల దండయాత్ర సాగిందట. అప్పట్లో కొన్ని వందల కోట్ల సంఖ్యలో ఉన్న కుందేళ్లు ఆ దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయట. పంట చేలనన్నిటిని నాశనం చేసి.. గడ్డిపోచ కూడా కనపడకుండా తినేసేవి. వాటి ధాటికి కనీసం చిన్న గడ్డి పొరక కూడా అక్కడ నిలవలేదు.

దీంతో పశు పోషణ పై తీవ్ర ప్రభావం పడిందట. వ్యవసాయం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది. దీన్ని ఎదుర్కునేందుకు... కుందేళ్ల పై అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఉరుగ్వే నుంచి తీసుకొచ్చిన ఓ వైరస్ సాయంతో కుందేళ్లను నాశనం చేసే ప్రయత్నం కూడా చేశారట. 90 శాతం కుందేళ్ల చనిపోయాయి. దాంతో భూములు క్రమంగా కోలుకున్నాయి. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుట పడింది. కానీ ఆ తర్వాత మళ్లీ కుందేళ్లు పెరిగిపోవడం ప్రారంభమైంది. మళ్లీ అదే వైరస్ ని ప్రయత్నించినప్పటికీ.. అవి చనిపోలేదు.

దీంతో 1990లో మరో కొత్త వైరస్ ను ప్రయోగించారు. దీని వల్ల మొదట్లో కాస్త ఫలితాలు వచ్చినా తర్వాత దీన్ని కూడా కుందేళ్లు తట్టుకోవడం ప్రారంభమైంది. దాంతో ఇప్పటికీ ఆస్ట్రేలియాలో కుందేళ్లపై పోరాటం కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తే.. భవిష్యత్తులో మళ్లీ గత పరిస్థితులే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని గ్రామీణ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఆస్ట్రేలియా లో కుందేళ్లు పెరుగుదలకు ఆ దేశ ప్రజలు కారణం. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

19వ శతాబ్దంలో యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు కుందేళ్లను ఎక్కువగా తీసుకొచ్చారు. అప్పట్లో ఇతర జంతువులను వేటాడేందుకు... ఈ కుందేళ్లను ఎరగా వాడేవారు. అలా తెచ్చిన కుందేళ్లే పెరిగి పెరిగి మందలుగా పెరిగిపోయాయి. దేశానికే సవాల్ విసిరే స్థాయికి చేరేందుకు ఎంతో కాలం పట్టలేదు. కొత్త వాతావరణానికి.. పరాయి జీవ జాతులను పరిచయం చేస్తే ఏం జరుగుతుందో, అది ఎలాంటి పరిమాణాలకు దారి తీస్తుందో చెప్పడానికి ఆస్ట్రేలియా నే బిగ్ ఎగ్జాంపుల్.