Begin typing your search above and press return to search.

పోలీసులూ సహకరించారా ?

By:  Tupaki Desk   |   4 Feb 2022 3:40 AM GMT
పోలీసులూ సహకరించారా ?
X
ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం చూసిన తర్వాత ఈ విషయం నిర్ధారణ అయిపోయింది. పీఆర్సీ వివాదం కారణంగా ప్రభుత్వంతో విభేదించిన ఉద్యోగులు కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాత పీఆర్సీ ప్రకారమే తమకు జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. అయితే కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తామని ప్రభుత్వం అంటోంది.

సుమారు 2 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు, 6 లక్షలమంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లను కూడా కొత్త పీఆర్సీ ప్రకారమే వేసేసింది. పీఆర్సీ విషయమై ప్రభుత్వంతో విభేదిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు గురువారం ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను తెలియజేశారు. విజయవాడలోని బీఆర్టీఎస్ మార్గంలో భారీ ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాల నుండి విజయవాడకు చేరుకోనీయద్దని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలను పోలీసులు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఎందుకంటే పీఆర్సీ వివాదంలో పోలీసులు కూడా భాగస్తులే కాబట్టి. అత్యవసర సర్వీసుల్లో ఉన్న కారణంగా పోలీసులు సమ్మెలో పాల్గొనటం లేదు. అందుకనే సమ్మె చేస్తున్నవారికి పోలీసులు పూర్తి సహకారం అందించినట్లు అర్ధమైపోతోంది.

పోలీసుల సహకారం లేకపోతే ఛలో విజయవాడ కార్యక్రమం ఇంతగా విజయవంతమయ్యే అవకాశమే లేదు. జిల్లాల సరిహద్దుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయులను నిలిపేయాలంటే పోలీసులకు పెద్ద పనేమీకాదు. అయినా జిల్లాలను దాటుకుని విజయవాడ వచ్చారంటే అర్ధమేంటి ? అయితే ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు స్ధానికంగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా సరే పోలీసులు తమ సహకారాన్ని అందించారనటంలో సందేహం లేదు.