Begin typing your search above and press return to search.

సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందా ?

By:  Tupaki Desk   |   4 Jan 2021 4:31 PM GMT
సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందా ?
X
మూడు నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రప్రభుత్వం-రైతు సంఘాల మధ్య చర్చలు మళ్ళీ మొదటికి వచ్చింది. ఎందుకంటే సోమవారం కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు రైతు సంఘాల నేతలకు మధ్య జరిగిన చర్చలు ఫెయిలయ్యాయి. కేంద్రమంత్రి కార్యాలయంలో ఈరోజు జరిగిన ఏడవ విడత చర్చలు చాలా సుదీర్ఘంగా జరిగాయి. ఎన్నిగంటలపాటు చర్చలు జరిగినా రెండువైపుల వాదనల్లో ఎటువంటి మార్పు రాకపోవటంతో చర్చలు ముగించారు.

చర్చలు విఫలమవ్వటానికి కేంద్రప్రభుత్వం మొండితనమే అని రైతసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో సమస్య పరిష్కారానికి రైతుసంఘాల నేతలు సానుకూలంగా స్పందించటం లేదని తోమర్ కూడా ఆరోపిస్తున్నారు. అంటే చర్చలు ఫెయిలవ్వటానికి మీరు కారణమంటే కాదు మేరీ కారణమని ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టేసుకుంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటినుండి కూడా నూతన చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ మీదే రైతుసంఘాల నేతలు గట్టిగా పట్టుబట్టారు. ఈ విషయం దేశమంతా తెలుసు. ఇప్పటికి కేంద్రమంత్రులు అనేకసార్లు చర్చలు జరిపినా ఉపయోగం లేకపోయింది. అంటే అర్ధమేంటి ? సమస్య పరిష్కారం కేంద్రమంత్రుల చేతుల్లో లేదని. ఎందుకంటే చట్టాల రద్దుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏమాత్రం సుముఖంగా లేరు. పైగా రైతులు డిమాండ్ చేస్తున్నట్లు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కుంబబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.

ఒకవైపు చట్టాలను రద్దు చేసేది లేదని చెబుతునే మరోవైపు కేంద్రమంత్రులను చర్చలకు పంపటంలో అర్ధమేలేదు. కూర్చుంటే స్వయంగా ప్రధానమంత్రే చర్చల్లో కూర్చోవాలి లేకపోతే రైతుసంఘాలను వాటి ఖర్మకు వాటిని వదిలేయాలి. ఇక్కడే ప్రధాని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానంగా ఉంది. కావాలనే చర్చలపేరుతో రైతుసంఘాల నేతల ఓపికిను పరీక్షిస్తున్నట్లుగా ఉంది. మరి మోడి వ్యూహం ఎంతకాలం పారుతుందో చూడాల్సిందే.