Begin typing your search above and press return to search.

ఆ కుటుంబాన్ని పాము పగబట్టిందా? ఈ ఉదంతం తెలిస్తే నిజమనుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   14 March 2022 3:38 AM GMT
ఆ కుటుంబాన్ని పాము పగబట్టిందా? ఈ ఉదంతం తెలిస్తే నిజమనుకోవాల్సిందే
X
ఈ మధ్య కాలంలో తగ్గింది కానీ.. ఓ పాతికేళ్ల క్రితం పాము.. పాము పగతో సినిమాలు రావటం.. పాము పగ మీద బోలెడన్ని విషయాలు తరచూ మాట్లాడుకోవటం కనిపించేది. పాములు పగబడతాయని.. వెంటాడి.. వెంటాడి మరీ కాటేస్తాయని చెబుతుంటారు. తాజా ఉదంతం వింటే.. ఇలాంటి మాటల్లో నిజం ఉందా? అనిపించటం ఖాయం.

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలోని మల్లయ్యపల్లి అదిఆంధ్రవాడకు చెందిన ఒక ఫ్యామిలీని ఒక పాము వెంటాడుతోంది. మరే కుటుంబం దొరకనట్లుగా.. ఒకే కుటుంబంలోని వ్యక్తులను వరుస పెట్టి కాటేస్తున్న వైనంతో.. సదరు కుటుంబం టెన్షన్ తో వణికిపోతోంది.

గడిచిన 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యుల్ని ఆరుసార్లు కాటేయటం ఇప్పుడా గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. మల్లయ్యపల్లి అదిఆంధ్రావాడకు చెందిన వెంకటేశ్.. ఆయన భార్య వెంకటమ్మ.. కుమారుడు జగదీష్.. తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తుంటారు.

వారంతా సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొట్టంలో జీవనం సాగిస్తుంటారు. శనివారం రాత్రి జగదీశ్ ఇంటి బయట నిద్ర పోతున్న వేళ.. అతడికి పాము కాటేసింది. ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలో వెంకటేశ్ ను రెండుసార్లు.. ఆయన తండ్రి.. భార్య..కుమారుడు ఒక్కోసారి చొప్పున పాము కాటుకు గురి కావటం గమనార్హం. తాజాగా వెంకటేశ్ కుమారుడు జగదీశ్ ను మరోసారి పాము కాటు వేసింది. దీంతో.. ఒకే కుటుంబాన్ని అదే పనిగా పాము కాటు వేస్తున్న వైనం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పాము మాట వింటేనే బెదిరిపోతున్న ఈ కుటుంబాన్ని వేరే ప్రాంతానికి వెళ్లమని చెబుతుంటే.. వారు మాత్రం తాము అక్కడే ఉంటామని చెబుతున్నారట.

తమను పాము నుంచి కాపాడాలని అధికారుల్ని వేడుకోవటంతో.. ఈ పాము నుంచి వారి కుటుంబాన్ని ఎలా కాపాడాలన్నది ఇప్పుడు పెద్ద టాస్కుగా మారినట్లు చెబుతున్నారు. చదివినంతనే సినిమా స్టోరీని గుర్తు చేసే ఈ ఉదంతంలో వెంకటేశ్ కుటుంబం పాము బారి నుంచి ఎలా బయటపడుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.