Begin typing your search above and press return to search.

రిషి సునాక్ కు పొంచివున్న పదవీ గండం..!

By:  Tupaki Desk   |   9 Jan 2023 5:30 PM GMT
రిషి సునాక్ కు పొంచివున్న పదవీ గండం..!
X
బ్రిటన్లో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది. కరోనా కాలంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే కరోనా ప్రభావం.. ద్రవ్యోల్భణం.. ఆర్థిక మాంద్యం.. నిరుద్యోగం వంటి సమస్యలు బ్రిటన్ ను వెంటాడుతున్నాయి. అయితే గత కొద్ది నెలల కాలంలోనే ముగ్గురు ప్రధానులు మారాల్సి వచ్చింది. పార్టీ అంతర్గత కారణాలు.. ఇతరత్ర సమస్యలతో ఇద్దరు ప్రధానులు పదవీ నుంచి తప్పుకున్న సంగతి తెల్సిందే.

ఇలాంటి సమయంలో ప్రవాసీ భారతీయుడు రిషి సునాక్ కు బ్రిటన్ ప్రధానిగా అవకాశం దక్కింది. రెండు సార్లు ప్రధాని రేసులో పోటీపడగా రిషి సునాక్ కు ఆశాభంగం కలిగింది. అయితే ముచ్చటగా మూడోసారి మాత్రం ప్రధాని రేసులో కన్జర్వేటీవ్ పార్టీ తరుపున నిలబడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కన్జర్వేటివ్ తరపున కొద్ది రోజుల గ్యాప్ లోనే ముగ్గురు ప్రధానులు మారినట్లయింది.

రిషి సునాక్ బ్రిటన్లోని పరిస్థితిని ఒక్కొక్కటి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు మాత్రం రిషి సునాక్ కు ఛాలెంజ్ మారబోతున్నాయి. 2023 మేలో బ్రిటన్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. రిషి సునాక్ ప్రధాని అయ్యాక తొలిసారి ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించకపోతే పార్టీ అధ్యక్ష బాధ్యతలను తిరిగి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు అప్పగించాలని టోరి సభ్యులు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను రిషి సునాక్ ఎలా గట్టిక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బెస్ట్ ఫర్ బ్రిటన్ చేపట్టిన ఫోకల్ డేటా పోలింగ్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రిషి సునాక్ క్యాబినెట్లోని 15 మంది మంత్రులు రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఆయన క్యాబినెట్లో కేవలం ఐదుగురు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తేలింది.

మరోవైపు కొన్ని దశాబ్దాలుగా గెలుపులో కీలకంగా మారిన పది స్థానాల్లో ఈసారి లేబర్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని బెస్ట్ ఫర్ బ్రిటన్ పేర్కొంది. ఈ పది స్థానాల్లో ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుండటంతో ఈసారి కన్జర్వేటీవ్ పార్టీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.

ముగ్గురు ప్రధానులు మారడం.. ద్రవ్యోల్భణం కట్టడి కాకపోవడంతో ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెలువడిన ఎన్నికల సర్వేల్లో కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ 20 పాయింట్లు ముందంజలో ఉందని తేలింది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే స్థానిక సంస్థల్లో కన్జర్వేటివ్ పార్టీ సత్తా చాటాల్సి ఉంది. దీంతో ఈ ఎన్నికలు రిషి సునాక్ కు ఛాలెంజ్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.