Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ఊర‌ట క‌ల్పించిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   1 July 2022 4:37 AM GMT
ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ఊర‌ట క‌ల్పించిన‌ట్టేనా?
X
ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న ఐదు రోజుల ప‌ని విధానాన్ని మ‌రో సంవ‌త్స‌రం పాటు పొడిగించింది. ఈ మేర‌కు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు అమలు చేస్తారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులిచ్చారు.

వాస్త‌వానికి ఈ ఐదు రోజుల ప‌నిదినాల విధానం జూన్ 27తో ముగిసింది. అప్ప‌టి నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. జూన్ 30 వ‌చ్చినా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంకా దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోయేస‌రికి ఆందోళ‌న చెందారు. ఈ నేప‌థ్యంలో వారికి ఊర‌ట క‌ల్పిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధానిలో రవాణా, వసతి సౌకర్యాలు సక్రమంగా అభివృద్ధి చెంద‌క‌పోవ‌డం, పిల్ల‌ల చ‌దువులు నేప‌థ్యంలో చాలా ఉంది ఉద్యోగులు త‌మ‌ కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచారు.

ఉద్యోగులే హైద‌రాబాద్-అమ‌రావ‌తి, అమ‌రావ‌తి-హైద‌రాబాద్ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము వారాంతంలో హైద‌రాబాద్ కు వెళ్ల‌డానికి వీలుగా వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించాల‌ని ఉద్యోగులు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్‌ 27వ తేదీ నుంచి ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్ర‌భుత్వం జారీ చేసిన‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారానికి ఐదు రోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకూ పనిచేయాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేశారు. దీంతో ఉద్యోగులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం వ‌ల్ల స‌చివాల‌యం, శాఖాధిప‌తుల కార్యాల‌యాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

మ‌రోవైపు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించినందుకు ఉద్యోగ సంఘాలు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి సీఎం వైఎస్ జ‌గ‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.