Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌లో ఆ పార్టీ చేయెత్తిసిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   10 Aug 2021 12:30 PM GMT
హుజూరాబాద్‌లో ఆ పార్టీ చేయెత్తిసిన‌ట్లేనా?
X
ఇంకా నోటిఫికేష‌న్ రాక‌పోయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌లు ఎప్పుడ‌నే స్ప‌ష్ట‌త లేక‌పోయిన‌ప్ప‌టికీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్ప‌టికే తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాలు ఈ వాతావ‌ర‌ణాన్ని మ‌రింత వేడెక్కిస్తున్నాయి. విజ‌యంపై దాదాపు అన్ని పార్టీలు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. త‌మ అభ్య‌ర్థుల విష‌యంలో ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను అనుస‌రిస్తున్నాయి. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ కాంగ్రెస్ తొంద‌ర‌ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం ఇప్పుడు అనుమానాల‌కు తావిస్తోంది. మిగ‌తా పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో వేగం చూపిస్తుంటే కాంగ్రెస్ మాత్రం నెమ్మ‌దిగా సాగుతుండ‌డంతో అస‌లు హుజూరాబాద్‌లో ఆ పార్టీ పోటీ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారిన హుజూరాబాద్‌లో విజ‌యం కోసం గ‌ట్టిగా పోరాడుతున్నారు. త‌న సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకుని అధికార టీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు పాద‌యాత్ర‌తో ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. మ‌రోవైపు వివిధ ర‌కాల ప్ర‌ణాళిక‌లు, వ్యూహాలు ర‌చిస్తూ.. విజ‌యం కోసం అన్ని ర‌కాలుగా టీఆర్ఎస్ పావులు క‌దుపుతోంది. ఇత‌ర పార్టీల‌కు చెందిన ప్ర‌ధాన నాయ‌కుల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకుని సాధ్య‌మైన స‌మీక‌ర‌ణాల‌పై దృష్టి సారించింది. ఓట‌ర్ల‌కు ఆక‌ర్షించేందుకు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థి ఎంపిక‌పై కొన్ని రోజులుగా ప్ర‌చారం సాగింది. ద‌ళిత అభ్య‌ర్థిని పోటీలోకి దించాల‌ని భావిస్తున్న‌ట్లు అందుకు దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ ఆయ‌న పోటీలో లేన‌ని ప్ర‌క‌టించారు. క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షుడు క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌, వ‌రంగ‌ల్‌కు చెందిన దొమ్మాటి సాంబ‌య్య పేర్లూ వినిపించాయి.

కొండా దంప‌తులు కూడా పోటీకి మొగ్గుచూపుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. వాళ్లు టీఆర్ఎస్ నుంచి తిరిగి సొంత గూటికి చేరారు. ఈ నేప‌థ్యంలో కొండా సురేఖ బ‌రిలో దిగుతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడేమో అస‌లు కాంగ్రెస్ పోటీలోనే ఉండ‌ద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పోటీ చేసి ఓట్లు చీలిస్తే అది అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంద‌ని ఈటల గెలిస్తే ఆ క్రెడిట్ ఆయ‌న‌కే వెళ్తుంది కానీ బీజేపీకి చెంద‌ద‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలా చూసుకున్నా ఫ‌లితంతో కాంగ్రెస్ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. దీంతో అధిష్ఠానం మాట్లాడి ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకుంటేనే మేల‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఒక‌వేళ పోటీ చేస్తే క‌నీసం డిపాజిట్ ద‌క్క‌క‌పోతే ప‌రువు పోవ‌డం ఖాయం కాబ‌ట్టి ముందుగానే పోటీ నుంచి త‌ప్పుకుంటే మేల‌ని అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ వ్య‌వ‌హారాన్ని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కాంగ్రెస్ పోటీలో ఉంటుందో? లేదా చేయి ఎత్తేస్తుందా తేలాలంటే మ‌రికొంత కాలం ఎదురు చూడాల్సిందే.