Begin typing your search above and press return to search.

సీఎంగా మొదటి సంతకమని జగన్ చెప్పింది మరిచారా బొత్స?

By:  Tupaki Desk   |   25 April 2022 5:30 PM GMT
సీఎంగా మొదటి సంతకమని జగన్ చెప్పింది మరిచారా బొత్స?
X
అధికారంలోకి రావటమే ముఖ్యం. అందుకోసం ఏమైనా చెబుతాం. ఎన్ని హామీలైనా ఇస్తామనే రాజకీయ నేతలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏపీలో ఇప్పుడేం జరుగుతుందో అదే జరుగుతుంది.

ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మళ్లీ రగిలిపోతున్నారు. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విషయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై వారు విరుచుకుపడుతున్నారు. ఈ రోజు (సోమవారం) సీఎంవోను ముట్టడిస్తామని చెప్పటం.. వందలాది పోలీసుల్ని రోడ్ల మీదకు తీసుకొచ్చి.. ఎవరి మీద అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

సీపీఎస్ పెన్షన్ స్కీమ్ విషయంలో తానేమీ చేయలేనని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని తానేమీ చేయలేనంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తేల్చటం.. నాటి విపక్ష నేత జగన్ మాత్రం.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినంతనే పెట్టే సంతకాల్లో సీపీఎస్ ఒకటంటూ చెప్పేవారు. పాదయాత్ర సమయంలోనూ.. ఎక్కడికి వెళ్లినా ఆయన నోటి నుంచి వచ్చే హామీల్లో ముఖ్యమైనది దీన్ని చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారంతా సీపీఎస్ తో తీవ్రమైన ఆర్థిక భారానికి గురవుతున్నారు.

జగన్ ఇచ్చిన హామీని నమ్మిన ప్రభుత్వ ఉద్యోగులు ఆయన్ను అధికారంలోకి వచ్చేందుకు తమకు చేతనైనంత సాయాన్ని చేశారని చెప్పాలి. పవర్లోకి వచ్చిన తర్వాత తమకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించటం తర్వాత.. క్యాలెండర్లో మూడేళ్లు గడిచిన తర్వాత కూడా ఉలుకు పలుకు లేకుండా ఉండటం.. అదే పనిగా అడిగిన తర్వాత.. కమిటీ వేశాం.. దాని రిపోర్టు వచ్చాక నిర్ణయం తీసుకుంటామంటే దానికి ఉద్యోగులు ఎలా రియాక్టు కావాలి? మరి.. హామీ ఇచ్చే వేళలో కమిటీ వేసి.. నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఉండాల్సిందన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వస్తోంది.

తాజాగా తమకిచ్చిన హామీని మర్చిపోయిన సీఎం జగన్ కు గుర్తు తెచ్చేందుకు వీలుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి పిలుపునివ్వటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత అనుభవాల్ని గుర్తు చేసుకున్న ప్రభుత్వం విజయవాడను పోలీసులతో నింపేసింది.

ఇలాంటి వేళ మీడియా ముందుకు వచ్చిన మంత్రి బొత్స తాజాగా స్పందిస్తూ.. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కమిటీ వేసిందని.. దాని రిపోర్టు వచ్చే వరకు ఆగాలన్నారు. అంతలోనే సీఎంవో ముట్టడి భావ్యమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ధర్మమా? అని ప్రశ్నిస్తున్న బొత్స వారికి.. పాదయాత్ర వేళ జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకోవాలంటున్నారు ఉపాధ్యాయులు.