Begin typing your search above and press return to search.

ముచ్చింతల్ లో ఆ ముగ్గురు మాటలు విన్నారా?

By:  Tupaki Desk   |   9 Feb 2022 4:30 AM GMT
ముచ్చింతల్ లో ఆ ముగ్గురు మాటలు విన్నారా?
X
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. ముగ్గురు ప్రముఖులు చేసిన కీలక వ్యాఖ్యలకు వేదిక ఒక్కటే కావటం.. ఆ ముగ్గురు భిన్నమైన మార్గాల్లోనడిచే వారు కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. అయితే.. ఈ ముగ్గురు వారి వారి రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్న వారు కావటం మరో విశేషంగా చెప్పాలి. ఈ ముగ్గురు ఎవరంటే.. ఒకరు అథ్మాత్మిక రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న చిన జీయర్ స్వామి అయితే.. మరొకరు రాజకీయ రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న అమిత్ షా అయితే.. ఇంకొకరు వ్యాపార రంగంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే మైహోం రామేశ్వరరావు.

ఇలా ఈ ముగ్గురిని మచ్చింతల్ లో జరుగుతున్నశ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలు వేదికగా మారటం గమనార్హం. ఈ ముగ్గురు మంగళ వారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీకి.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో చినజీయర్ స్తామి నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు కొత్త అర్థాలు తీసుకునేలా ఉండటం గమనార్హం.

ఇంతకూ ఈ ముగ్గురి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఎక్కడో ఏదో తగులుతున్నట్లుగా అనిపించేలా ఉండటం విశేషం. ఇంతకూ ఈ ముగ్గురి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలేంటి? అన్నది వారి మాటల్లోనే చూస్తే..

చినజీయర్ స్వామి

‘‘ రాజకీయ పార్టీల మఽధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ భగవంతుని కార్యక్రమాలు, సేవ విషయంలో కలిసి పని చేయాలి. భక్తి మార్గంలో ఉన్న వారందరూ కలిసిమెలసి ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది. సమతామూర్తి దివ్యక్షేత్రం పనులకు ఆరంభం నుంచి సీఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు అందించింది. సీఎం కేసీఆర్‌ కూడా శ్రీవైష్ణవుడేనని, ఆయనకు భక్తికూడా ఎక్కువే. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళుతున్నారు. మేము భారతీయులమని మనమంతా దేశంలో, బయటా గర్వంగా చెప్పుకునే విధంగా పాలిస్తున్నారు’’

అమిత్ షా

‘‘ఎలాంటి అర్భాటం లేకుండా, ప్రభుత్వ మర్యాదలు పొందకుండా ఒక గ్రామంలో కూర్చుని భూకంప బాఽధితుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాకే ఆయన తిరిగి వెళ్లారు. ఇప్పుడు కూడా సమతామూర్తి విగ్రహ ఏర్పాటును విజయవంతంగా పూర్తిచేశారు. ఆయన చేపట్టిన కార్యం ఏదైనా విజయవంతగా ముగిస్తారు’’ అంటూ చినజీయర్ స్వామిని ప్రశంసించారు. ఈ సందర్భంగా అమిత్ షా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..

‘‘సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన కాలం. సమతామూర్తి నిర్మాణం జరిగిన సమయంలోనే భవ్యమైన రామమందిర పునర్నిర్మాణం, 650 సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ్‌కారిడార్‌, కేదార్‌ధామ్‌, బదరీధామ్‌ పునర్నిర్మాణం లాంటివి జరగడం విధి, విధాత ఇచ్చిన ఆశీర్వాదం. రామానుజాచార్యుల జీవితమే ఓ సందేశమని.. అందరూ సమానులే అని వెయ్యేళ్ల క్రితమే ఆయన చాటారని.. ఆలయ ప్రవేశంలో అందరికీ సమాన హక్కు ఉందని చెప్పడమే కాకుండా సంపూర్ణంగా అమలుచేసిన మహనీయుడు రామానుజాచార్యులు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతమార్గంతో సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చారు’’

‘‘ఈ మార్గంతోనే దేశం తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ ఏకతాటిపై నిలబడింది. సమతామూర్తి యుగయుగాల వరకూ రామానుజాచార్యుల సందేశాన్ని తెలుపుతుంది. విశిష్టాద్వైతం భూమి ఉన్నంత కాలం ఉంటుంది. సనాతన ధర్మంలో సమస్యలు వచ్చినప్పుడల్లా.. శంకరాచార్యులు, రామానుజాచార్యులు.. ఇలా ధర్మ రక్షణ కోసం ఎవరో ఒకరు ముందుకొచ్చారు. ధర్మం కోసం జీవితాన్ని అర్పించిన మహాపురుషుల విగ్రహాలను చూస్తే.. ఎంతో ఉత్సాహం లభిస్తుంది. మనల్ని మరింత ముందుకు వెళ్లే శక్తిని అవి అందిస్తాయి. నేను ఈరోజు అలాంటి శక్తిని, ఉత్సాహాన్ని పొందా’’

మైహోం రామేశ్వరరావు

‘‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తరువాత అంతటి సమర్థ నేత అమిత్‌షా’’