Begin typing your search above and press return to search.

అంత నచ్చేశాడా... పవన్ తో మళ్ళీ మళ్లీ

By:  Tupaki Desk   |   12 Nov 2022 6:24 AM GMT
అంత నచ్చేశాడా... పవన్ తో మళ్ళీ మళ్లీ
X
దాదాపుగా ఎనిమిదేళ్ల కాలం నుంచి మోడీని పవన్ కలవలేదు. కానీ చిత్రంగా ఇపుడు ఆ అరుదైన అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ ని నేరుగా తన వద్దకే పిలిపించుకుని మరీ మోదీ విశాఖలో విడిది చేసిన చోటనే ముచ్చట్లు పెట్టారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే పవన్ కి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఎలాంటిదో అని.

పవన్ సైతం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏపీకి సంబంధించి తనకు అవగాహన ఉన్న అన్ని విషయాలు ప్రధాని మోడీ దృష్టిలో పెట్టారు. అంతే కాదు, ఏపీకి మంచి జరగాలన్న తన తాపత్రయాన్ని కూడా ఆయన ముందు వ్యక్తం చేశారు. ఆ విధంగా జస్ట్ కర్టెసీ కాల్ అన్నట్లుగా పది నిముషాల పాటు సాగాల్సిన ఈ సమావేశం కాస్తా నలభై నిముషాలకు పైగా సాగింది.

ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లోనే కలకలం రేపింది. జనసేన బీజేపీ కలసి ఉమ్మడి అజెండాతో ముందుకు వస్తున్నాయా లేక తెలుగుదేశాన్ని కూడా కలుపుకుని కొత్త ఎత్తులతో పొత్తులతో వస్తాయా అన్న చర్చ కూడా నడచింది. అయితే ఈ ఊహాగానాలు ఇలా ఉండగానే మోడీ మరోసారి మళ్ళీ కలుద్దామంటూ పవన్ తో అన్నారన్న టాక్ ఇపుడు స్ప్రెడ్ అవుతోంది.

అది విశాఖలోనే జరగవచ్చు, లేకపోతే ఢిల్లీలో కూడా అతి తొందరలో జరగవచ్చు అని అంటున్నారు. నిజానికి పవన్ని విశాఖలోనే తనకు అందుబాటులో ఉండాలని ప్రధాని కోరారని వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య నలభై నిముషాల పాటు సాగిన సమావేశంలో ఇంకా చాలా అసంపూర్తి అంశాలు ఉన్నాయని, దాంతో మరో మారు సిట్టింగ్ వేయాలని భావించే ప్రధాని ఇలా పవన్ని ఉండాలని కోరినట్లుగా చెబుతున్నారు.

ఇక ఈ ఉదయం జగన్ ప్రధానికి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీకి సంబంధించిన అంశాలతో పాటు ఏమైనా రాజకీయ అంశాలు చర్చించారా అన్న చర్చ అయితే వస్తోంది. ఇక జగన్ తో మాట్లాడిన తరువాత ఒక క్లారిటీ ఏపీ వ్యవహారాల మీద తెచ్చుకున్న ప్రధాని మరోసారి పవన్ తో భేటీ అవుతారు అని కూడా అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఏపీకి సంబంధించి పవన్ని కీలకం చేయడానికే ప్రధాని ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

నిజానికి ప్రధానిని కలసి పవన్ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన విశాఖలో ఒక రోజు ఉండిపోయారు. దానికి కారణం ప్రధాని తో మరో విడత భేటీ ఉంటుందన్న సమాచారం ఉండడమే అంటున్నారు. మరి ఈ భేటీ విశాఖలో కాకపోతే కనుక ఢిల్లీలో సాధ్యమైంత తొందరలో ఉండవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మోడీ విశాఖ టూర్ కాదు కానీ జనసేనకు పవన్ కి ప్రత్యేకించి రాజకీయంగా బాగా లాభించింది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.