Begin typing your search above and press return to search.

మోడీ మీద ఎంత కోపమైనా ప్రోటోకాల్ ను మాత్రం మిస్ కాని దీదీ

By:  Tupaki Desk   |   28 July 2021 7:14 AM GMT
మోడీ మీద ఎంత కోపమైనా ప్రోటోకాల్ ను మాత్రం మిస్ కాని దీదీ
X
ఈ దేశంలో కత్తులు దూసుకునే రాజకీయ శత్రుత్వం ఉన్న రాజకీయ అధినేతలు ఎవరంటే చాలా తక్కువ పేర్లే వినిపిస్తాయి. రాష్ట్రాలకు అతీతంగా చూస్తే.. ఎక్కువ మంది ఓటేసేది మాత్రం.. ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకే వేస్తారు. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ.. సీఎంగా ఉన్న మమత మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. పాము.. ముంగిస మాదిరి వారి మధ్య నడిచిన పోరాటంలో మమతనే విజయం సాధించగా.. మోడీకి మాత్రంబెంగాల్ లో ఎదురుదెబ్బ తగిలింది.

ఒకవేళ.. మోడీస్థానంలో కానీ మమత స్థానంలో కానీ మరే ఇతర నేతలు ఉన్నా.. తాజాగా వారి మధ్య జరిగిన భేటీ లాంటిది సాధ్యమయ్యేదే కాదని చెప్పాలి. ఇరువురు పాతతరం రాజకీయ నేతలు కావటం.. ఎంత కొత్తతరహా రాజకీయాన్ని ఒంట బట్టించుకున్నా.. వారిలో పాత వాసనలు పోలేదనటానికి నిదర్శనంగా తాజా భేటీని చెప్పాలి.ఈ భేటీ సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత భారీగా మార్కుల్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి.

దీనికి కారణం లేకపోలేదు. తన ఢిల్లీ పర్యటనలో మొదట ప్రధాని మోడీని కలిసిన తర్వాతే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలవటానికి నిర్ణయం తీసుకోవటం ఒకటిగా చెప్పాలి. ఇక్కడ కూడా ఆమె తూచా తప్పకుండా ప్రోటోకాల్ పాటించారని చెప్పాలి. ప్రధాని మోడీని ముందుగా భేటీ అయి.. ఆ తర్వాతే కాంగ్రెస్ అధినేత్రిని కలిసేందుకు మొగ్గుచూపారు. అంతేకాదు.. ప్రధాని మోడీతో భేటీ అయిన సందర్భంలో ఆమె కూర్చున్న విధానం చూస్తే.. చాలా ఒద్దికగా.. కుర్చీ చివర్లో కూర్చున్న తీరు ఆసక్తికరంగా మారింది.

అదే మరే ఇతర మహిళా ఫైర్ బ్రాండ్ నేతలైతే.. మోడీతో ఉన్న వైరానికి దర్జాగా.. దర్పంగా కూర్చోవటం ఉండేది.కానీ.. అలాంటిదేమీ ప్రదర్శించకుండా సాదాసీదాగా వ్యవహరించిన ఆమె తీరును చూస్తే.. పాత తరం రాజకీయానికి కొత్త తరం రాజకీయానికి మధ్య వ్యత్యాసం ఇట్టే అర్థమవుతుంది. ప్రధాని మోడీని కలిసి వచ్చిన తర్వాత కూడా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా హుందాగా వ్యవహరించారు. తమ రాష్ట్రానికి అవసరమైన టీకాల విన్నపాన్ని ప్రధాని ముందు పెట్టానని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా మమత చెప్పారు.
దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న పెగాసస్ ఉదంతాన్ని తాను లేవనెత్తినట్లుగా ఆమె ఎక్కడా ప్రస్తావించనప్పటికీ.. ఆమెచేసిన సూచన ఆసక్తికరంగా మారింది. ‘పెగాసస్ మీద ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేయాలి’ ఆమె పేర్కొన్నారు. మరి.. దీదీ డిమాండ్ ను ప్రధాని మోడీ పరిష్కరిస్తారా? విననట్లు ఊరుకుంటారా? అన్నది కాలమే బదులివ్వాలి.