Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మించినట్లుగా దీదీ అభ్యర్థుల జాబితా

By:  Tupaki Desk   |   6 March 2021 12:30 AM GMT
కేసీఆర్ కు మించినట్లుగా దీదీ అభ్యర్థుల జాబితా
X
దేశ రాజకీయాల్లో తనకు మించిన సీనియర్ మరొకరు లేనట్లు చెప్పేస్తూ.. తరచూ గొప్పలు చెప్పే అధినేతగా టీడీపీ అధినేత చంద్రబాబును చెప్పాలి. అలాంటి ఆయన ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. రోజుల తరబడి అభ్యర్థుల ఎంపిక కోసం కిందామీదా పడుతుంటారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజు వరకు తర్జనభర్జనలు పడుతూ టికెట్లుఫైనల్ చేసేందుకు తెగ ప్రయాస పడుతుంటారు.

దీనికి భిన్నంగా 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా లేఖను ఇచ్చిన వెంటనే భారీ ఎత్తున అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.

తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతకు మించిన నిర్ణయం తీసుకొని అవాక్కు అయ్యేలా చేశారు. దీదీకి సాటి వచ్చే వారెవరూ ఉండరన్నట్లుగా అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకే లిస్టులో వెల్లడించేశారు. ఇలాంటి సాహసం దీదీకే చెల్లు అనేలా చేశారు. మొత్తం 294 స్థానాలు ఉండే పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 291 మంది అభ్యర్థుల జాబితాను ఒకే ధఫాలో ప్రకటించారు. మిగిలిన మూడు స్థానాల్ని ఆమె మిత్రపక్షాలకు కేటాయించారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ ను బరిలో దింపనున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ఆమె రెండు చోట్ల పోటీ చేయటం ఖాయమన్న మాట బలంగా వినిపించినా.. ఆ అంచనాలకు భిన్నంగా ఆమె ఒకేచోట బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దీదీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన సువేందు.. తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. తాజాగా అదే స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన దీదీ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. తానుఈ నెల తొమ్మిదిన నందిగ్రామ్ వెళతానని.. పదిన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే దీదీకి తేజస్వీ యాదవ్.. అరవింద్ కేజ్రీవాల్.. హేమంత్ సోరెన్.. ఉద్ధవ్ ఠాక్రేలు మద్దతు తెలిపారు.

తాజాగా ఆమె ఎంపిక చేసిన అభ్యర్థుల తీరు తెన్నులు చూస్తూ.. పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

- ఈసారి 80 ఏళ్లకు పైబడిన వారికి టికెట్లు ఇవ్వలేదు

- దీదీ ప్రకటించిన 291 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు

- బీజేపీ నుంచి పొంచి ఉన్న ముప్పును గుర్తించిన దీదీ ఈసారి ముస్లిం మైనార్టీలకు 42 సీట్లు కేటాయించారు. 79 మంది ఎస్పీలకు.. 17 మంది ఎస్టీలకు టికెట్లు ఇచ్చారు.