Begin typing your search above and press return to search.

ష‌ర్మిల రాయ‌ల‌సీమ‌లో అడుగు పెట్ట‌లేదా?

By:  Tupaki Desk   |   2 July 2021 10:30 AM GMT
ష‌ర్మిల రాయ‌ల‌సీమ‌లో అడుగు పెట్ట‌లేదా?
X
వైఎస్ త‌న‌య, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ష‌ర్మిల‌కు పెద్ద చిక్కే వ‌చ్చింది. తెలంగాణలోనూ రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.. రాజ‌కీయ అరంగేట్రం చేసి..సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన ష‌ర్మిల‌.. ఈ క్ర‌మంలో దూకుడుగా వెళ్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో ఆమె చేసిన ఒక ట్వీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. తెలంగాణ చుక్క నీటిని కూడా వ‌దులుకునేది లేదు! అని ష‌ర్మిల రెండు రోజుల కింద‌ట ట్వీట్ చేశారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌ను ఓవ‌ర్ టేక్ చేయాల‌ని అనుకున్నారో.. లేక రాజకీయ వ్యూహంలో భాగంగానో.. ష‌ర్మిల ఈ కామెంట్ చేశారు.

ఇదే ఇప్పుడు ష‌ర్మిల‌పై రాయ‌ల‌సీమ వాసులు.. నిప్పులు చెరిగేలా చేస్తోంది. వాస్త‌వానికి ష‌ర్మిల రాయ‌ల సీమ బిడ్డే. క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇక్క‌డ నుంచే రాజ‌కీయాలు చేశారు. ఆయ‌న త‌న‌య‌గా ఆమెకు ఇది పుట్టిల్లు. అయితే.. తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాకు చెందిన వ్య‌క్తిని వివాహం చేసుకున్నందున‌.. తెలంగాణ త‌న‌కు మెట్టినిల్ల‌ని ఆమె చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇంత వ‌ర‌కు అంద‌రూ హ‌ర్షించారు. అయితే.. నీటి విష‌యం తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి.. ముఖ్యంగా పులిచింత‌ల, రాయ‌ల సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును.. సీమ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ష‌ర్మిల‌.. చుక్క‌నీటిని కూడా వ‌దులుకునేది లేద‌ని వ్యాఖ్యానించ‌డంపై సీమ ప్రాంత ప్ర‌జ‌లు, రాజ‌కీయ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ``నీ పుట్టింటికి న‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు.. స‌మ‌స్య ను సానుకూలంగా ప‌రిష్క‌రించే మార్గం చూపించాలి త‌ప్ప‌.. నీ వ్య‌క్తిగ‌త రాజ‌కీయం కోసం.. ఇలా నోరు పారేసుకోవ‌డంత‌గ‌దు`` అని ఒకింత ఆగ్ర‌హంతోనే సోష‌ల్ మీడియాలో ష‌ర్మిల‌పై కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ విధానానికి క‌ట్టుబ‌డితే.. ష‌ర్మిల రాయ‌ల సీమ‌లో అడుగు పెట్ట‌లేద‌ని కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి జ‌ల జ‌గ‌డం ష‌ర్మిల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింద‌న‌డంలో సందేహం లేద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.