Begin typing your search above and press return to search.

చంద్రబాబు, జగన్ ఎంత తేడానో చూడండి!

By:  Tupaki Desk   |   6 Oct 2019 6:39 AM GMT
చంద్రబాబు, జగన్  ఎంత తేడానో చూడండి!
X
ఒక మండల తహశీల్దార్ ను ఈడ్చి కొట్టాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అప్పటికే రౌడీషీటర్ , కనీసం నలభై కేసులను ఎదుర్కొంటున్న చింతమనేని ప్రభాకర్ పై అప్పుడు చర్యలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో చింతమనేనిని చంద్రబాబు నాయుడు మన్నించేశారు. అంతేనా.. చింతమనేని చేత దాడికి గురైన వనజాక్షిపై ఎదురుదాడి చేశారు. ఆమె సరిహద్దులు దాటారంటూ కొత్త అభియోగాలు మోపారు!

ఒక ప్రభుత్వాధికారిపై తెలుగుదేశం ఎమ్మెల్యే దాడి చేస్తే అప్పుడు జరిగినది అది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టు జరిగింది. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అధికార పక్ష ఎమ్మెల్యే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత. అలాంటి వ్యక్తి అరెస్టు జరిగింది.

ఒక ఎంపీడీవో ఫిర్యాదు మేరకు ఆయన అరెస్టు జరిగింది. వాస్తవానికి ఎంపీడీవో పై శ్రీధర్ రెడ్డి దాడి చేయలేదు. ఆయన అనుచరులు కొందరు ఆమె ఇంటి వద్ద గలాభా సృష్టించారట. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ముందుగా కేసులు నమోదయ్యాయి, తాజాగా శ్రీధర్ రెడ్డి అరెస్టు జరిగింది.

ఈ అరెస్టు చింతమనేని ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఉంది. తహశీల్దార్ పై దాడి చేసిన తన పార్టీ ఎమ్మెల్యేను చంద్రబాబు నాయుడు వెనకేసుకు వచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోలేదు. తహశీల్దార్ కే కౌంటర్ ఇచ్చారు. అదీ చంద్రబాబు నాయుడి తీరు.

జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలకు వెనుకాడటం లేదు. కేసులు నమోదు చేయడమే కాకుండా, శరవేగంగా ఆయన అరెస్టు కూడా జరిగింది. ఇలాంటి వ్యవస్థనే ప్రజలు కోరుకున్నారు. నిజానిజాలు విచారణలు తెలుస్తాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనను అరెస్టు చేయడం మాత్రం సర్వత్రా జగన్ పై అభినందనలకు కారణం అవుతోంది.