Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు - కేసీఆర్‌ కు తేడా అదే..

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:31 AM GMT
చంద్రబాబుకు - కేసీఆర్‌ కు తేడా అదే..
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక అప్‌ డేట్స్.. ఒకటేమో.. పొత్తు విషయంలో ఫైనల్ డెసిషన్ కోసం కాంగ్రెస్ నుంచి టీడీపీకి కబురొచ్చిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న సీనియర్ లీడర్లు - మంత్రులతో ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ.. రెండోది, సాధారణ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించడం - దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లడానికి సెప్టెంబరు 2న ప్రగతి నివేదిక పేరిట భారీ సభ నిర్వహించడంపై తెలంగాణ మంత్రులతో ఆ రాష్ట్ర సీఎం - టీఆరెస్ అధినేత కేసీఆర్ అత్యవసర సమావేశం. ఈ రెండు సందర్భాల్లో చంద్రబాబు - కేసీఆర్‌ లు తీసుకున్న నిర్ణయాలు వారు తమ పార్టీలోని నేతల మాటకు ఎంత విలువిస్తున్నారన్న విషయం బయటపడింది.

నిన్న అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ అయి కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని అడిగారు. అందుకు కొందరు సీనియర్లు అభ్యంతరం చెప్పారని టాక్. కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇప్పుడు అదే పార్టీతో కలవడం.. అందులోనూ రాష్ట్రాన్ని విభజించిన పాపం ఇంకా కాంగ్రెస్ మెడలోనే ఉండడం వల్ల ఆ పార్టీతో పొత్తుకుంటే జనంలోకి తప్పుడు సందేశం వెళ్తుందని కొందరు సీనియర్లు బాబుతో అన్నారట. అయితే.. అప్పటికే కాంగ్రెస్‌ తో పొత్తుకు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోగా... కాంగ్రెస్‌ పై ఉన్న వ్యతిరేకత పోయేలా మీడియా ద్వారా సానుకూలత తెచ్చే బాధ్యత నాది అంటూ పూచీ తీసుకున్నారట. దీంతో ఎప్పటిలా చంద్రబాబు డెసిషన్ తీసుకుని ఏదో అడగాలి కాబట్టి తమను అడుగుతున్నారని అర్థం చేసుకున్న నేతలు .. మీ ఇష్టం సార్ - ఫైనల్ డెసిషన్ మీదే అంటూ ఆయనకే ఆ నిర్ణయాధికారం కట్టబెట్టేశారని టాక్. ఇంకా, కాంగ్రెస్ - టీడీపీ పొత్తు అధికారికంగా ప్రకటితం కాకపోయినా పార్టీవర్గాల నుంచి ఇదంతా బయటకు పొక్కుతోంది.

మరోవైపు బుధవారం కేసీఆర్ అత్యవసరంగా కేబినెట్‌ తో భేటీ అయ్యారు. అంతకు కొద్దిరోజుల ముందు ఆయన దిల్లీ వెళ్లి కేంద్రం ఎప్పుడు ఎన్నికలకు వెళ్లనుందో కనుక్కుని.. వారు ముందస్తుకు వచ్చే ఉద్దేశంలో లేకపోవడంతో అంతకంటే ముందు జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తమ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీ వద్ద చర్చించిన్లు తెలంగాణ రాజకీయవర్గాల్లో వినికిడి. ఆ నేపథ్యంలో పార్టీ ముఖ్యుల - మంత్రులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన వారితో భేటీ అయ్యారు. కానీ, ఆ భేటీలో ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదని మెజారిటీ సంఖ్యలో మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారట. ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళతాయని మంత్రులు అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. దాంతో మంత్రులు అభిప్రాయాలు విన్న కేసీఆర్.. మనం ఇంతవరకు ముందస్తుకు వెళ్తామని ఎక్కడా అధికారికంగా చెప్పలేదు కాబట్టి సమస్యేమీ లేదని - ఎప్పటిలా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్దామని.. ఈలోగా ప్రజల్లోకి వెళ్దామని చెప్పారట.

ఈ రెండు సందర్భాల్లోనూ ఇద్దరు నేతలూ తాము ముందే నిర్ణయాలు తీసుకున్నాక పార్టీ నేతల అభిప్రాయాన్ని అడిగారు. వీరిలో చంద్రబాబు పార్టీ నుంచి అభ్యంతరం వచ్చినా తన నిర్ణయాన్ని వారిపై రుద్దగా... కేసీఆర్ మాత్రం పార్టీ నేతల నిర్ణయానికి విలువిచ్చి తన నిర్ణయం మార్చుకున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ అంతర్గత సమావేశాల్లో నిజంగా ఏం జరిగిందో అందులో పాల్గొన్న నేతలకు తప్ప ఇతరులకు తెలియకపోయినా అందుబాటులో ఉణ్న సమాచారం ప్రకారం ఆ రెండు సమావేశాల్లో జరిగింది ఇదే అని తెలుస్తోంది. దాని ప్రకారం చూసుకుంటే పార్టీలోని ఇతర లీడర్లకు ఏ నేత ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్థమవుతోంది.