Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ లో ఉన్న‌ది.. కాంగ్రెస్ లో లేనిది ఇదే!

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:30 PM GMT
మోడీ బ్యాచ్ లో ఉన్న‌ది.. కాంగ్రెస్ లో లేనిది ఇదే!
X
ప్ర‌ధాని మోడీలోనూ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలోనూ ఒక గుణం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ప‌రిస్థితులు త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్నా.. గాలి త‌మ‌కు ప్ర‌తికూలంగా ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వారు ప‌డే క‌ష్టం.. శ్ర‌మ అంతా ఇంతా కాదు. ఈ ధోర‌ణే.. 22 ఏళ్ల పాల‌న అనంత‌రం కూడా గుజ‌రాత్ లో బీజేపీ అధికారాన్ని నిలుపుకోవ‌టంగా చెప్పాలి. మ‌రింత‌గా అర్థం కావాలంటే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని గుర్తుకు తెచ్చుకోండి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేత‌లు ప‌లువురి నోటి నుంచి ఓట‌మి మాట త‌ర‌చూ వినిపించేది. అదేమంటే.. ప‌దేళ్లు అధికారంలో ఉన్నాం..ఐదేళ్లు ప‌వ‌ర్ లేకుంటే ఏమి? మ‌ళ్లీ మాకే అవ‌కాశం వ‌స్తుంది క‌దా? అన్న మాట వినిపించేది. ఇలాంటి ధోర‌ణి బీజేపీ నేత‌ల్లో అస్స‌లు క‌నిపించ‌దు. చివ‌రికంటా పోరాడాల‌న్న ధోర‌ణి బ‌లంగా క‌నిపిస్తుంది. చేజిక్కిన అవ‌కాశాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడిచి పెట్ట‌కూడ‌ద‌న్న భావ‌న వారిలో ఎక్కువ‌ని చెప్పాలి.

చివ‌రి క్ష‌ణాల్లోనూ విజ‌యం కోసం క‌మ‌ల‌నాథులు ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు. కానీ.. కాంగ్రెస్ నేత‌ల్లోనూ.. కార్య‌క‌ర్త‌ల్లోనూ అలాంటి తీరు అస్స‌లు క‌నిపించ‌దు.

ఏజ్ ఓల్డ్ నాటి వ్యూహంతో పాటు.. అల్ప సంతోషులుగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు క‌నిపిస్తారు. త‌మ విజ‌యానికి తామే అసూయ‌ప‌డే త‌త్త్వం కాంగ్రెస్‌లో క‌నిపిస్తే.. బీజేపీలో అందుకు భిన్న‌మైన పోరాట‌త‌త్త్వం క‌నిపిస్తుంది. విజ‌యాన్ని వారు ప్రాణ స‌మానంగా తీసుకోవ‌టం క‌నిపిస్తుంది. ఈ తీరే గుజ‌రాత్ లో బీజేపీ విజ‌యంలో కీల‌క భూమిక పోషించింద‌ని చెప్పాలి.

22 ఏళ్లు అధికారంలో ఉన్న త‌ర్వాత‌.. ఒక‌లాంటి నిరాస‌క్త‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తున్న‌ప్పుడు ఓట‌మిని ముందే ఒప్పేసుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. అయితే.. ఓట‌మిని ఒప్పుకోని త‌త్త్వం క‌ష్టప‌డితే చివ‌రి క్ష‌ణాల్లోనూ ఫ‌లితాన్ని మార్చ‌వ‌చ్చ‌న్న ఆశావాహ దృక్ఫ‌ధం మోడీ.. షాల‌లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. గుజ‌రాత్ మొద‌టిద‌శ పోలింగ్ త‌ర్వాత మోడీలో మారిన స్వ‌రమే దీనికి నిద‌ర్శ‌నం.

ఓట‌మి పోటు నుంచి త‌ప్పించుకోవ‌టం కోసం త‌న‌కున్న ఏ అవ‌కాశాన్ని మోడీ వ‌దిలిపెట్ట‌లేద‌ని చెప్పాలి. తాను ప్ర‌ధాన‌మంత్రి స్థానంలో ఉండి కూడా ఎలాంటి మాట‌లు మాట్లాడ‌కూడ‌దో అలాంటి మాట‌లు మాట్లాడేశారు. గుజ‌రాత్ లో విజ‌యం త‌ర్వాతే ఇంకేదైనా అన్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంద‌ని చెప్పాలి. నిత్యం వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా మాట్లాడే మోడీ నోట.. గుజ‌రాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వ‌చ్చిన మాట‌లు ఆద్యంతం వ్యూహాత్మ‌కంగా ఉన్నాయ‌ని చెప్పక తప్ప‌దు. అదే.. గుజ‌రాత్ లో మ‌రోసారి పాగా వేసేలా చేసింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల నుంచి స‌గ‌టు జీవి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.

జీవితంలో ఎద‌గ‌టానికి.. అనుకున్న‌ది సాధించ‌టానికి చాలానే క‌ష్ట‌ప‌డాలి. అందుకు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. వాటిని అధిగ‌మించాలి. స‌వాళ్ల‌ను చూసి బెదిరిపోకూడ‌దు. నిరాశ‌లోనూ.. అంత‌ర్లీనంగా ఆశ అన్న ప‌దం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. క‌మ్ముకునే నిరాశ‌లో ఆశ‌ను మాత్ర‌మే చూస్తే.. గుజ‌రాత్ లో బీజేపీకి ద‌క్కిన విజ‌యం స‌గ‌టు జీవి జీవితంలోనూ అలాంటిదే సొంతం కావ‌టం ఖాయం. అందుకు వేరే మాటే లేదు.