Begin typing your search above and press return to search.

కర్ఫ్యూ కి ..లాక్‌ డౌన్‌ కి మధ్య తేడా ఏమిటీ?

By:  Tupaki Desk   |   26 March 2020 11:30 PM GMT
కర్ఫ్యూ కి ..లాక్‌ డౌన్‌ కి మధ్య తేడా ఏమిటీ?
X
కరోనా వైరస్ దేశంలో విస్తరించకుండా ఉండేందుకు .. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. అయితే లాక్‌ డౌన్‌ అనే పదం ఏ చట్టంలోనూ లేదు. ప్రజల కదలికలను నియంత్రిస్తూ ఆంక్షలు విధించడాన్నే లాక్‌ డౌన్‌ అని అంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం జారీచేసిన ఆంక్షలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని - అప్పటికి పరిస్థితి అదుపులోకి రానట్లయితే కర్ఫ్యూ విధిస్తామని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లేందుకు కర్ఫ్యూ పాస్‌లు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు ఇప్పుడు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు ‘ఎపిడమిక్‌ డిసీసెస్‌ ఆఫ్‌ 1897 యాక్ట్, డిసాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్ట్‌’ కింద ప్రత్యేక ఆదేశాలను జారీ చేశాయి. ఈ యాక్ట్ ప్రకారం .. లాక్ డౌన్ అమలు లో ఉన్న సమయంలో ఇంట్లో నుండి అత్యవసరం అయితే తప్పా బయటకి రాకూడదు. అస్పత్రులకు లేదా మందుల షాపులకు వెళ్లడం - ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకోవడం కోసం వెళ్లే అత్యవసర సమయాలు - నిత్యావసర సరకుల కోసం వెళ్లడం మినహా అన్ని సమయాల్లో ఇంట్లోనే ఉండాలి. అలాగే రోడ్డు పై ఐదుగురికి మించి గుమ్మిగూడకుడదు.

రోడ్లపై ఐదుగురికి మించి తిరగరాదంటూ ఐపీసీలోని 144వ సెక్షన్‌ కింద కూడా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. 144వ సెక్షన్‌ కింద ఆదేశాలను ఏ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అయినా ఇవ్వొచ్చు. లాక్‌ డౌన్‌ ఉత్తర్వులను ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే చీఫ్‌ సెక్రటరీ విడుదల చేస్తారు. కర్ఫ్యూ ఉత్తర్వులను ఒకప్పుడు డీఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి జారీ చేయగా, 2009లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పోలీసు కమిషనర్‌ తమ జురిడిక్షన్‌ లో కర్ఫ్యూను విధించవచ్చు. కర్ఫ్యూ కింద కూడా 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ సమయాల్లో బయట తిరగరాదు. తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిన ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాంతం పోలీసు స్టేషన్‌ నుంచి పాస్‌ లు తీసుకోవాల్సి ఉంటుంది.

నిత్యావసర సరకుల కోసం కర్ఫ్యూ సడలింపు వేళల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. లౌక్‌ డౌన్‌ లో సమయంలో రాత్రి మినహా పగలు ఎప్పుడైనా నిత్యావసరాల కోసం పౌరులు వెళ్లవచ్చు. అయితే , అత్యవసరం అయినప్పుడు ఏ సమయంలో అయినా కూడా బయటకి వెళ్లవచ్చు. వాస్తవానికి నేడు దేశంలో చాలా రాష్ట్రాలు కర్ఫ్యూను. లాక్‌ డౌన్‌ ను అమలు చేస్తున్నాయి. కర్ఫ్యూను అమలు చేయడంలో భాగంగా ఉల్లంఘించిన వారిపై పోలీసులు లాటి జుళిపిస్తున్నారు. ఇప్పుడు కూడా పోలీసులు లాక్‌ డౌన్‌ ను అమలు చేయడానికి లాఠీలకు పని కల్పిస్తున్నారు. అది ఎప్పటికీ చట్ట విరుద్ధమే. అయితే ఎపిడమిక్‌ డిసీస్‌ యాక్ట్‌ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులకు విచారణ నుంచి మినహాయింపు ఉంది.