Begin typing your search above and press return to search.

ఇదీ 'చంద్రుల' మధ్య తేడా

By:  Tupaki Desk   |   30 Aug 2018 12:31 PM GMT
ఇదీ చంద్రుల మధ్య తేడా
X
వారిద్దరూ ఒకప్పుడు సహచరులు...వారిద్దరూ రెండు దశాబ్దాల పాటు ఒకే రాజకీయ పార్టీలో ఉన్నవారు. ఒకరికి ముఖ్యమంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా జాతీయ స్థాయిలో పేరుంది. మరొకరికి ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువ. జాతీయ స్థాయిలో పరిచయాలు కూడా తక్కువే. ఆ ఇద్దరూ ఎవరో అర్థ‌మయ్యే ఉంటుంది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ఎన్నికలకు ముందే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కూడా ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. నాలుగేళ్లపాటు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాత్రం విడిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు నరేంద్ర మోదీతో స్నేహం లేదు. అలాగని వైరమూ లేదు.

నాలుగేళ్ల స్నేహంలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు లాభపడే, ఉపయోగపడే ఒక్క పని కూడా చేయించుకోలేక పోయారు చంద్రబాబు నాయుడు. కేంద్రంలో తన మంత్రులు, మనషులు ఉన్న‌ప్ప‌టికీ గడచిన నాలుగేళ్లల్లో చంద్రబాబు నాయుడు సాధించింది శూన్యం. ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదాపై కూడా చంద్రబాబునాయుడు సాధించింది ఏమీలేదు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలంటూ కేంద్ర ప్రభుత్వం చెబితే అవును నిజమేనంటూ చంద్రబాబు నాయుడు వంత పడారు. నాలుగేళ్ల తర్వాత తాను మోసపోయానంటూ ప్రజల వద్దకు వెళుతున్నారు.బిజేపీతో ఎన్నికల పొత్తు, ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహం దేనికీ అక్కరకు రాలేదు. గడిచిన నాలుగేళ్లల్లో 30 సార్లు ఢిల్లీ వెళ్లాను అని చెప్తున్నచంద్రబాబు సాధించింది ఏదీ లేదని ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎలాంటి స్నేహమూ, పొత్తు లేని తెలంగాణముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం అన్నీ పనులను సజావుగా చేయించుకుంటున్నారు. కొత్త జిల్లాలకు అనుమతి, జోనల్ వ్యవస్థపై ఆర్డినెన్స్ వంటివి కేసీఆర్ సాధించిన విజయాలు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు, రోడ్ల విస్తరణకు వందల కోట్లు నిధులు తెచ్చుకుంటున్నారు.

తెలంగాణలో ఏ శాఖకు చెందిన మంత్రులు కేంద్రంలోని ఆయా శాఖకు చెందిన మంత్రులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవసరం మేర‌కు ఢిల్లీ వెళ్లి అక్కడ మకాం వేసి అన్ని పనులు పూర్తి అయ్యేలా చూసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన వేణుగోపాలాచారిని ఢిల్లీలోనే ఉంచి వివిధ పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదిలేలా చేసుకుంటున్నారు. జోనల్ వ్యవస్థపై కేసీఆర్ స్వయంగా లాబీయింగ్ చేసి మరో ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్‌ శర్మను అక్కడే ఉంచారు. జోనల్ వ్యవస్థపై ఆర్డినెన్స్ వచ్చే వరకూ రాజీవ్ శర్మ ఢిల్లీని వదలలేదు. ఇదీ కేసీఆర్ పనితీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ సలహాదారుడిగా పరకాల ప్రభాకర్ ను నాలుగేళ్లు తన ప‌క్కనే ఉంచుకున్నారు. ఆయన ఏ సలహా ఇచ్చారో దేవుడికి ఎరుక. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.