Begin typing your search above and press return to search.

కాస్త నమ్మకం ప్రసాదించు పవనూ!

By:  Tupaki Desk   |   22 Feb 2018 5:01 PM GMT
కాస్త నమ్మకం ప్రసాదించు పవనూ!
X
పవన్ కల్యాణ్ పోకడ ఎలా ఉంటున్నది! బయటినుంచి చూస్తున్న వారికి తమ తమ అభిప్రాయాలు, అభిమానాలను బట్టి.. రకారకాలుగా అనిపించవచ్చు. కానీ ఆంతరంగికంగా కనీసం ఒక రోజైనా మెలగిన వారికి భిన్నమైన క్లారిటీ ఉంటుందని ఆశించవచ్చు. పవన్ భజన చేసుకుంటూ ఆయన జట్టులో ఉన్న వారిని పక్కన పెడితే.. ఇటీవల రెండు రోజులు చేసిన కసరత్తులో పవన్ ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీలో పనిచేసిన వారిలో చాలా మంది దాదాపుగా తటస్థులే! వారికి ఆయన పోకడ, అనుసరిస్తున్న రాజకీయం.. ఇవన్నీ ఎలా అనిపించాయి..? అనేది చాలా కీలకమైన అంశం.

పవన్ ఓసారి ఫోనులోను - ఓసారి నేరుగానూ తనను పలకరించిన తర్వాత.. కమిటీ భేటీకి వచ్చిన తొలి ముహూర్తంలోనే లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్.. ‘తమ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని’ తెగేసి చెప్పారు. కమిటీ చేసే కసరత్తు మీద ఆశలు పెట్టుకోవద్దని ఆయన సెలవిచ్చారా? లేదా బిట్వీన్ ది లైన్స్ చూసినట్లయితే.. పవన్ కల్యాణ్ తీరు మీద తమకు పెద్దగా ఆశలు లేవని తన అంతరంగాన్ని ఆ రూపంలో ఆవిష్కరించారా? అనే అనుమానాలు కూడా పలువురికి ఉన్నాయి.

ఆ రకంగా ఆయన తొలిరోజు భేటీ కాగానే.. చాలా చాకచక్యంగా రెండోరోజు అధ్యయనాన్ని మాజీ ఐఏఎస్ - ఐపీఎస్ అధికార్ల చేతిలో పెట్టి తాను తప్పుకున్నారు. ఆ రకంగా నిర్దేశించినందున తొలిరోజు వచ్చిన ఇతర మేధావులెవ్వరూ రెండోరోజు రాకపోయినా.. పెద్దగా పట్టింపు రాలేదు.

ఇకపోతే తొలిరోజు సమావేశానికి హాజరైన వారిలో ఒకరైన కొణతల రామకృష్ణ.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ చేస్తున్న కసరత్తు - నిజనిర్ధారణ అనే ప్రక్రియ వల్ల రాష్ట్రానికి ఒరిగే ఉపయోగం ఏమీ ఉండదని తేల్చిచెప్పేశారు.

పోరాట పథాన్ని నిర్ణయించుకోవడానికి మేధోమధనం అవసరమే గానీ.. అసలు పోరాటమే లేకుండా మేధోమధనం చేయడం దండగ అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు. దానితో ప్రత్యక్ష కార్యాచరణ గురించి ఆలోచిస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వాల నుంచి గణాంకాలు తీసుకున్నాక - అధ్యయనం చేసి నిజాలు తేల్చాక వాటిని ఏం చేస్తారో పవన్ కల్యాణ్ చెప్పాలని కొణతల ప్రశ్నించడాన్ని గమనిస్తోంటే.. పవన్ కల్యాణ్ కనీసం తాను ఆహ్వానించిన మేధావులు రాజకీయ ప్రముఖులకు కూడా భవిష్య కార్యాచరణ గురించి కనీస వివరాలు చెప్పకుండానే ఆపినట్లు అర్థమవుతోంది.

ఏపీకి సంబంధించిన ఆవేదన గురించి హైదరాబాదులో మీటింగు ఏంటని నిలదీసిన కొణతల రామకృష్ణ మాటల్లో పవన్ కల్యాణ్ తన వైఖరితో జేఎఫ్‌ సీ కోసం వచ్చిన మేధావుల్లో ఎవ్వరికీ నమ్మకం కలిగించలేకపోయారనే అభిప్రాయం కలుగుతోంది. అలాగే తాను ఒక్కరోజు మాత్రమే హాజరయ్యానని కొణతల తేల్చేయడం.. ఉండవిల్లి రాజమండ్రిలో - కమ్యూనిస్టులు వారి సొంత పోరాట కార్యక్రమాల్లో ఉండడాన్ని గమనిస్తోంటే.. తొలిరోజు వచ్చిన మేధావులెవ్వరూ కమిటీ అధ్యయనం కింద క్రియాశీలంగా ప్రస్తుతం పనిచేయడం లేదని.. ఆ ముగ్గురు రిటైర్డు అధికారులు మాత్రమే ఉన్నారని.. కమిటీ ఇంత సుదీర్ఘమైన కసరత్తు గట్రా ఏదో ఆమాంబాపతు వ్యవహారంలా తేలిపోయేట్లుందని పలువురు పెదవి విరుస్తున్నారు.