Begin typing your search above and press return to search.

హరీశ్ లో లేనిది.. కేటీఆర్ లో ఉన్నదేంది? 2

By:  Tupaki Desk   |   17 Feb 2016 6:03 AM GMT
హరీశ్ లో లేనిది.. కేటీఆర్ లో ఉన్నదేంది? 2
X
పార్టీ కోసం విపరీతంగా కష్టపడే హరీశ్.. అందుకు తగ్గ ఇమేజ్ బిల్డింగ్ విషయంలో వెనుకబడటమే కారణంగా చెప్పొచ్చు. మేనమామ మనసు నొచ్చుకోకూడదన్న ఆలోచన.. ఆయనకు మించి తనకు ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదన్న విధేయత.. వెరసి ఆయన్ను అండర్ ప్లే చేసేలా చేస్తాయి. నిజానికి ఇలాంటి తత్వమే.. కేటీఆర్ ఎదిగేలా చేశాయనటంలో సందేహం లేదు. హరీశ్ కానీ పార్టీలో తగిన స్పేస్ ఇవ్వకుండా ఉండి ఉంటే.. కేటీఆర్ కాలు కదిపే అవకాశం ఉండేది కాదు. నిజానికి హరీశ్ గురించి బాగా ఎరిగిన వారు చెప్పే మాటేమిటంటే.. కేటీఆర్ విషయంలో హరీశ్ అంచనాలు వేరని చెబుతారు. కేసీఆర్ కుమారుడిగా పరిచయమైన కేటీఆర్ ను తక్కువగా అంచనా వేసినట్లుగా చెబుతారు. ఆయన ప్రభావం పార్టీ మీద తక్కువగానే ఉంటుందని.. తన పట్టు పార్టీపై పూర్తిగా ఉండి.. మామ తర్వాత మేనల్లుడే అంతా అన్నట్లు వ్యవహరిస్తున్న పరిస్థితిని కేటీఆర్ తన సామర్థ్యంతో బ్రేక్ చేసే పరిస్థితి పెద్దగా ఉండదని భావించటమే పెద్ద తప్పుగా చెబుతారు.

దీనికి తోడు.. మంచి వక్త అయిన హరీశ్ కు ధీటుగా కేటీఆర్ మాట్లాడే సత్తాను ప్రదర్శిస్తారని కూడా ఊహించలేదని చెబుతారు. ఇక.. హరీశ్ వ్యవహారశైలి కొన్ని వర్గాలకు మాత్రమే నచ్చేలా ఉంటుందన్న విషయం తెలిసిందే. మాస్ తో మమేకమయ్యే హరీశ్..క్లాస్ వరకూవస్తే.. ఆయన సమూహంలో ఒంటరిగా మిగులుతారే తప్పించి.. వారిలో కలిసిపోవటం కనిపించదు. హైదరాబాద్ పేజ్ త్రీ సర్కిల్లో హరీశ్ ఊసు అస్సలు వినిపించదు. పారిశ్రామిక వర్గాలతో ఆయనకున్న సంబంధాలు అంతంతమాత్రమే.

ఇవే కాదు.. అధికారులతో వ్యవహరించే తీరు.. దేశీయంగా.. విదేశీ ప్రముఖులతో ఆయనతో భేటీ అయ్యేది కాస్త తక్కువే. కష్టపడి పని చేయటం.. అద్భుతమైన వ్యూహాలు పన్నే తెలివి ఉన్న హరీశ్.. సాఫ్ట్ గా.. స్మార్ట్ గా వ్యవహరించే ధోరణికి దూరంగా ఉంటారు. ఇదే అంశం కేటీఆర్ ను ఎదిగేలా చేసిందని చెప్పొచ్చు.

వివిధ వర్గాలతో ఫ్రీగా మూవ్ అయ్యే కేటీఆర్ తీరుకు హరీవ్ వ్యవహారం పూర్తి భిన్నంగా ఉంటుంది. తన నియోజకవర్గం.. తన జిల్లాలో తన ప్రభావాన్ని ప్రదర్శించే హరీశ్.. తెలంగాణ వ్యాప్తంగా తన ముద్ర పడేలా చేయలేకపోయారు. ఇక.. కేటీఆర్ విషయానికి వస్తే.. ఆయన చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు. ఆయన మాట కూడా సౌమ్యంగా ఉంటుంది. పరుషంగా మాట్లాడినా అది కొద్ది సందర్బాల్లోనే. ఒదిగి ఉండటంతో పాటు.. తనకన్నా సీనియర్ నేతల్ని ఎలాంటి భేషజాలు లేకుండా.. పార్టీ అధినేత కొడుకునన్న భావన కలగనీయకుండా ‘‘అన్నా’’ అంటూ కలుపుకుపోయే తత్వం కనిపిస్తుంది. దీనికి తోడు.. మితవాద లక్షణాలు కేటీఆర్ లో పుష్కలం.

పదవి పట్ల విపరీతమైన ఆశ.. ఎదగాలన్న కాంక్ష కనపడనీయకుండా జాగ్రత్తగా ఉండే కేటీఆర్.. గుండెల్లో ఎంత మంట ఉన్నా.. పెదాల మీద చిరునవ్వు మాత్రం చెరగనీయరు. అదే సమయంలో.. స్నేహంగా ఉండే వారితో ఓపెన్ గా ఉండటమే కాదు.. తన ‘లోపలి’ విషయాల్ని పంచుకునేందుకు మొహమాట పడరు. ఇక ఆయనకు ఉన్న మరో బలం.. అటు తెలంగాణ వారితో పాటు.. ఇటు ఆంధ్రోళ్లను కూడా మెప్పించే సత్తా ఆయన సొంతం. మొదట తానున్న ప్రాంతం దాటి ఆంధ్రా ప్రాంతమైన గుంటూరులో చదువు కోసం వెళ్లి బాగా నలిగిన కేటీఆర్ తర్వాతి రోజుల్లో విదేశాలకు వెళ్లటం.. అక్కడ వారితో మమేకం కావటం ద్వారా.. అందరికి అమోదయోగ్యమైన వ్యక్తిలా ఉండటం ఆయనకు పెద్దగా కష్టం కాదు. ఇదే కేటీఆర్ కు లాభించేలా చేయటంతోపాటు.. హరీశ్ రావుకు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేసింది.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. హరీశ్ లో ఉన్న అన్ని లక్షణాలు కేటీఆర్ లో కనిపిస్తాయి. అదే సమయంలో కేటీఆర్ లో ఉన్న కొన్ని గుణాలు హరీశ్ లో మచ్చుకు కూడా కనిపించవు. అదే.. కేటీఆర్ కు హరీశ్ కు మధ్య విభజన రేఖ గీసేలా చేయటంతో పాటు.. కేటీఆర్ లో ఉన్నదేంది? హరీశ్ లో లేనిదేంది అన్న కొందరి ప్రశ్నకు కారణమవుతుందని చెప్పొచ్చు.