Begin typing your search above and press return to search.

మ‌హారాష్ట్ర స‌ర్కారులో క‌ల్లోలం.. మంత్రి ఏకనాథ్ షిండే తిరుగుబాటు!

By:  Tupaki Desk   |   21 Jun 2022 6:30 AM GMT
మ‌హారాష్ట్ర స‌ర్కారులో క‌ల్లోలం.. మంత్రి ఏకనాథ్ షిండే తిరుగుబాటు!
X
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌-నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ స‌ర్కారుకు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే కేబినెట్ లో మంత్రిగా ఉన్న శివ‌సేన సీనియ‌ర్ నేత‌ ఏక‌నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశార‌ని తెలుస్తోంది. త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న 11 మంది ఎమ్మెల్యేల‌తో ఆయ‌న గుజ‌రాత్ లోని సూర‌త్ లో క్యాంపు ఏర్పాటు చేశార‌ని స‌మాచారం. దీంతో మ‌హారాష్ట్ర లోని సంకీర్ణ స‌ర్కారు తీవ్ర ఇబ్బందుల్లో ప‌డింది.

ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌లు, తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్ కూట‌మికి చుక్కెదురు అయింది. కేవ‌లం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, రెండు రాజ్య‌స‌భ సీట్ల‌ను మాత్ర‌మే అధికార కూట‌మి గెలుచుకోగ‌లిగింది.

మ‌రోవైపు బీజేపీ ఏకంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు, నాలుగు రాజ్య‌స‌భ సీట్ల‌ను ద‌క్కించుకుని స‌త్తా చాటింది. వాస్తవానికి బీజేపీకి న‌లుగురు ఎమ్మెల్సీల‌ను మాత్ర‌మే గెలిపించుకోగ‌ల బ‌లం ఉంది. అయినా క్రాస్ ఓటింగ్ తో ఐదు స్థానాలు గెలుచుకుంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌తోపాటు అధికార కూట‌మికి చెందిన స‌భ్యులు క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేల బ‌లంగా ఉండ‌గా 133 ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. క్రాస్ ఓటింగ్ చేసిన‌వారిలో ఏక‌నాథ్ షిండే వ‌ర్గం వారు ఉన్నార‌ని అనుమానిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు పులి మీద పుట్ర‌లా ఏక‌నాథ్ షిండే రూపంలో వ‌చ్చిన క‌ల్లోలంతో ఉద్ధ‌వ్ ఠాక్రే స‌ర్కారు త‌ల్లడిల్లుతోంది. జూన్ 20 ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచే షిండేతోపాటు 11 మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయార‌ని తెలుస్తోంది. వీరంతా ఒక ప్ర‌త్యేక విమానంలో సూర‌త్ వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం.

జూన్ 21న మంగ‌ళ‌వారం మధ్యాహ్నం ఏక‌నాథ్ షిండే మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి త‌న తిరుగుబాటుకు కార‌ణాల‌ను వివ‌రిస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఏక‌నాథ్ షిండే బీజేపీ నేత‌ల‌తోనూ ట‌చ్ లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. షిండేతో క‌లిపి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మ‌ద్ద‌తిస్తారని అంటున్నారు. ఇదే జ‌రిగితే శివ‌సేన సంకీర్ణ స‌ర్కారు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవ‌డం ఖాయం.

గ‌త కొంత‌కాలంగా ప్ర‌భుత్వంపై ఏక‌నాథ్ షిండే అసంతృప్తితో ఉన్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు అస‌మ్మ‌తి వ‌ర్గం ఇచ్చి న షాకుతో ఉద్ద‌వ్ ఠాక్రే అత్య‌వ‌స‌రంగా ఎమ్మెల్యేల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి నేత‌లంతా హాజ‌రుకావాల‌ని కాంగ్రెస్, ఎన్సీపీ, శివ‌సేన ఆల్టిమేటం జారీ చేశాయి.