Begin typing your search above and press return to search.

రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై మిత్రపక్షాల్లో వ్యతిరేకత

By:  Tupaki Desk   |   23 July 2018 12:50 PM GMT
రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై మిత్రపక్షాల్లో వ్యతిరేకత
X
నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల సారథిగా - ప్రధాని అభ్యర్థిగా నిర్ణయిస్తూ తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయం యూపీయే కూటమిలోని పార్టీలు - పాతమిత్రులకు ఏమాత్రం నచ్చలేదట. ముఖ్యంగా సమాజ్ వాది పార్టీ రాహుల్ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.

అలాగే మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో కలిసి పనిచేసిన బీఎస్పీ కూడా రాహుల్ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం అంగీకరించడంలేదు. ఆ పార్టీ ఇప్పటికే ఆ విషయాన్ని ఖరాకండీగా చెప్పేసింది.

ఇకపోతే బీజేపీతో విభేదిస్తూ వస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ పై కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఏమూలో ఆశ ఉంది. అయితే... మమతా బెనర్జీ తాజాగా 2019 జనవరి నుంచి ఫెడరల్ ప్రంట్ యాక్టివేట్ అవుతుందని చెప్పడంతో ఇక ఆమెపై కాంగ్రెస్ ఆశలు వదులుకోవాల్సిందేనని అర్థమవుతోంది.

వీరంతా చాలరన్నట్లు సొంత పార్టీలోనే రాహుల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు. పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్నట్లుగా ఎవరికి వారు లోలోన అయిష్టత ప్రదర్శిస్తున్నా పార్టీ నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితి. దీంతో వచ్చే ఎన్నికల్లో రాహుల్ అభ్యర్థిత్వమే కాంగ్రెస్ కొంప ముంచే ప్రమాదముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.