Begin typing your search above and press return to search.

తెదేపాలో లుకలుకలు భేదాభిప్రాయాలు!

By:  Tupaki Desk   |   2 March 2018 10:30 AM GMT
తెదేపాలో లుకలుకలు భేదాభిప్రాయాలు!
X
కేంద్రం తమ పట్ల చిన్న చూపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఏం చేయాలి? పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ పరువు ఎలా కాపాడుకోవాలి? ఏం చేస్తే.. ప్రజల ముందుకు మళ్లీ వెళ్లడానికి మనకు అవకాశం ఉంటుంది... ఇలాంటి చర్చ తెలుగుదేశం పార్టీలో వాడిగా వేడిగా జరుగుతున్నది. చంద్రబాబునాయుడు శుక్రవారం ఉండవిల్లిలోని తన నివాసంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలతో సన్నాహక సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సందర్భంతా వచ్చిన వారంతా ప్రస్తుత పరిణామాల మీద ఎవరి అభిప్రాయాల్ని వారు వెల్లడించారు.

అయితే రాష్ట్ర ప్రయోజనాలను సాధించడం కోసం తాము చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నట్లుగా నిరూపించుకోవాలంటే గనుక... తక్షణం ఏం చేయాలి? అనే విషయంలో సీనియర్ నాయకులు, ఎంపీల మధ్య అనేక భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించాలా... కలిసే ఉండాలా.. ప్రభుత్వంనుంచి మాత్రమే బయటకువచ్చి మద్దతు ఇవ్వాలా.. లేదా, పార్టీ ఎంపీలు అందరూ రాజీనామాలు చేసేయాలా అనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా స్పందిస్తున్నారు. తాజాగా గురువారం నాడు ఢిల్లీలో వెంకయ్యనాయుడు సమక్షంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు అమిత్ షా తో జరిపిన భేటీ ఎఫెక్టు కూడా ఎంపీల మీద బాగా పడుతున్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రం ప్రతిస్పందన ఏమాత్రం సంతృప్తి కరంగా లేదని, ఎంపీల ఆందోళన తర్వాత ఇప్పటిదాకా వారి తీరులో ఎలాంటి మార్పు కనిపంచ లేదని... స్వయంగా అమిత్ తో మీటింగులో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు చెబుతోంటే.. ‘‘రామ్మోహన్ నాయుడు - కుటుంబరావు చర్చల్లో పురోగతి కనిపించింది - ఆర్థిక బిల్లులో ఏమైనా హామీలు ఇస్తారేమో చూస్తాం - కేంద్రంలో ఎలాంటి కదలిక ఉందో ఇంకా తెలియదు’’అంటూ ఎంపీ గల్లా జయదేవ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక్కసారి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనేసినందుకు తెగ హీరోలాగా తెదేపా కార్యకర్తలంతా కీర్తించేయడంతో.. ఉబ్బితబ్బిబైపోయి.. ఏదోసాధించేసినట్లు.. తన ప్రసంగం కేంద్రాన్ని వణికించినట్లు భావిస్తున్న గల్లా జయదేవ్ ఇప్పుడు చప్పబడిపోయారేమో తెలియదు గానీ.. ఆయనకు అంతా పాజిటివ్ గా కనిపిస్తున్నట్లుంది.

‘‘చంద్రబాబు సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోంది- పది రూపాయలు భిక్షం వేస్తే ఏపీ అభివృద్ధి చెందదు- ఎంపీల రాజీనామాలతో ఒరిగేదేమీలేదు- అమిత్ షాతో ఎంపీలు జరిపిన చర్చలు వల్ల కూడా ఉపయోగంలేదు’’అని జేసీ దివాకర్ రెడ్డి అంటోంటే.. ‘‘బీజేపీతో కొనసాగాలా? వద్దా అనేదానిపై చర్చిస్తాం’’ అని సీఎం రమేష్ సంకేతాలు ఇస్తున్నారు.

మొత్తానికి ఎంపీలందరూ తెగతెంపులు, రాజీనామాలు అనే అంశాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నట్లు అర్థమవుతోంది.