Begin typing your search above and press return to search.

ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి కష్టమేనా?

By:  Tupaki Desk   |   8 Dec 2018 7:46 AM GMT
ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి కష్టమేనా?
X
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో కూకట్ పల్లి.. శేరిలింగంపల్లి గురించే ముందు చెప్పుకోవాలి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సెటిలర్లు అధికంగా ఉండటం.. తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండటం.. ఈ పార్టీకి మద్దతుగా నిలిచే సామాజిక వర్గ ఓటర్ల సంఖ్యా ఎక్కువే కావడంతో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగలరన్న ధీమా ఉంది. అందుకే ప్రజా కూటమి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకే ఈ రెండు నియోజకవర్గాల్ని కేటాయించారు. కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని.. శేరిలింగం పల్లి లో భవ్య ఆనంద్ ప్రసాద్ ను నిలబెట్టింది టీడీపీ. వీళ్లిద్దరినీ బలమైన అభ్యర్థులుగానే భావించారు. వీరి విజయం నల్లేరు పై నడకే అన్న ప్రచారం కూడా నడిచింది. కానీ ప్రచారం తర్వాత కథ మారింది. పోరు హోరాహోరీ గా ఉంటుందన్న సంకేతాలు ముందే వచ్చాయి.

దీని కి తోడు పోలింగ్ జరిగిన తీరు చూస్తే ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థుల విజయం అంత తేలిక కాదని స్పష్టమవుతోంది. కూకట్ పల్లిలో నమోదైన పోలింగ్ శాతం 57 మాత్రమే. ఇక శేరిలింగం పల్లి లో అయితే మరీ దారుణంగా 48 శాతం పోలింగే జరిగింది. ఈ శాతాలు దేనికి సంకేతం అన్న చర్చ మొదలైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 5 వేల రూపాయలు పంచారని ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఇంత తక్కువ పోలింగ్ జరగడం ఆశ్చర్యం కలిగించేదే. డబ్బులు తీసుకుని కూడా చాలా మంది ఓటర్లు ఓట్లు వేయడానికి రాలేదని తెలుస్తోంది.

పోలింగ్ శాతం తక్కువ జరిగిందంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన విషయం కాదంటున్నారు. నిజంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాలనుకుంటే సెటిలర్లు పెద్ద ఎత్తున వచ్చి పట్టుదలతో ఓట్లు వేసేవారు. కానీ అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు ఓటింగ్ శాతం చూస్తే. మరి ఇక్కడ డిసెంబరు 11న ఎలాంటి ఫలితాలొస్తాయో చూడాలి.