Begin typing your search above and press return to search.

రూ.2వేల నోట్లు తీసుకుంటే చిక్కులేనా?

By:  Tupaki Desk   |   10 Nov 2016 7:18 AM GMT
రూ.2వేల నోట్లు తీసుకుంటే చిక్కులేనా?
X
ఎప్పుడూ లేని విధంగా కొత్త కొత్త సందేహాలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. చేతిలో డబ్బు ఉంచుకొని మరీ డబ్బు కోసం తపించాల్సి రావటం.. ఎప్పుడూ లేని విధంగా డబ్బుల్ని ఆచితూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది. పెద్ద నోట్లపై ప్రధాని మోడీ ప్రకటించిన నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇంతకాలం ధీమా ఇచ్చిన పెద్దనోట్లు ఇప్పుడు పెద్ద దిగులుగా మారిపోయాయి. చేతిలో ఉన్న పెద్ద నోట్లను వదిలించుకోవటం.. వాటిని చిన్న నోట్లుగా మార్చుకోవటం పెద్ద చిక్కుప్రశ్నగా మారింది.

ఒక రోజు మొత్తం బ్యాంకులు పని చేయకపోవటం.. రెండు రోజుల పాటు ఏటీఎంలు పని చేయని నేపథ్యంతో పాటు.. ఒకసారికి రూ.4వేలు మాత్రమే బ్యాంకులు నగదు ఇచ్చే పరిస్థితి. దీనికి తోడు వారానికి ఇంత మొత్తమే బ్యాంకులు ఇస్తారన్న పరిమితి ఉండటంతో ఆచితూచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కొద్దిరోజుల పాటు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) ఉదయం నుంచి కొత్త రూ.2వేల నోట్లతో పాటు చిన్ననోట్లను బ్యాంకులు పంపిణీ చేయటం మొదలైంది. చాలామంది కొత్త నోట్లు వచ్చాయన్న ఉత్సాహంతో ఇస్తున్న నాలుగు వేలకు కొత్త నోట్లను తీసుకుంటున్నారు. అయితే.. ఇలా చేస్తే చిక్కులు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఎంత కొత్త నోట్లు అయినా రూ.2వేల నోటు తీసుకోగానే సరిపోదు. అందుకు సరిపడా చిల్లర మార్కెట్లో లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంటే.. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.2వేల నోటును తీసుకొచ్చి ఎవరికి ఇచ్చినా.. దానికి చిల్లర ఇచ్చే పరిస్థితుల్లో వ్యాపారులు లేరన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అందుకే.. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవాలనుకునే వారు.. వీలైనంతవరకూ చిల్లరనోట్లను చేతిలో ఉంచుకోవటం ముఖ్యం. ఇంతకాలం లైట్ తీసుకున్న రూ.10.. రూ.20.. రూ.50.. రూ.100 నోట్లను వీలైనంతవరకూ ఉంచుకోవటం మంచిది. ఏ షాపులోకి వెళ్లినా.. ఆ చిల్లర నోట్లను తీసుకునే వెసులుబాటు ఉండటం.. పెద్దనోట్లకు చిల్లర నోట్లు ఇచ్చేందుకు వ్యాపారులు.. వివిధ సేవా విభాగాలు సిద్ధంగా లేవన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. బ్యాంకులకు వెళ్లి పెద్ద నోట్లను మార్చుకోవాలని అనుకున్న వారంతా చిల్లర నోట్లను తీసుకోవటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/