Begin typing your search above and press return to search.

కేసీఆర్ గెలుపుకు / ఓటమికి మధ్య ఇవేనట..

By:  Tupaki Desk   |   25 Oct 2018 5:23 AM GMT
కేసీఆర్ గెలుపుకు / ఓటమికి మధ్య ఇవేనట..
X
అనూహ్యం.. గందరగోళం.. అసలేం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతున్నాయా.? బండ్లు ఓడలవుతున్నాయా.? తెలంగాణ ఎన్నికల సంగ్రామంలోకి వెయ్యి ఏనుగుల బలంతో దిగిన కేసీఆర్ కు సైన్యమే శాపంగా మారుతోందా.? అభ్యర్థులే ఆయన గెలుపును ప్రభావితం చేయనున్నారా.? క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎదురవుతున్న వ్యతిరేక పవనాలు టీఆర్ఎస్ పుట్టిముంచబోతున్నాయా.? గులాబీ దండును నిలదీస్తున్న వైనం ఇప్పుడు ఆ పార్టీని షేక్ చేస్తోందా.? ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్న నేతలకే టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇచ్చేయడం చెడు ఫలితాలను అందిస్తోందా.? అంటే అవుననే అంటున్నాయి క్షేత్రస్థాయి పరిస్థితులు..

అవును తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లోకి వస్తున్న వారికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మా ఊరికి ఈ హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఫెక్సీలు, ఖాళీ బిందెలు, తదితర నిరసనలతో గ్రామస్థులు హోరెత్తిస్తున్నారు..

తాజాగా తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూర్ లోని ఓ గ్రామ ప్రజలు నిరసన సెగలతో గోబ్యాక్ అంటూ వెళ్లగొట్టారు. హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబును ఆ నియోజకవర్గంలోని నవాబుపేట ప్రజలు నిరసనలతో వెనక్కి వెళ్లిపోయేలా చేశారు. చెన్నూర్ టికెట్ పొందిన బాల్క సుమన్ ను ఓ అవ్వ నాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏదంటూ తన గుడిసెను చూపించి తన బాధను మీడియా ముఖంగా వెళ్లగక్కింది.

ఇవే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ హామీనిచ్చిన మిషన్ భగీరథ నీళ్లేవి అంటూ జనం నిలదీస్తున్నారు. నీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగను అన్న కేసీఆర్ మాటే ఈ ఎన్నికల్లో బాగా హైలెట్ అవుతోంది. కొన్ని అద్భుత పథకాలు ప్రకటించి ప్రజల్లో దూసుకెళ్తామనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు అభ్యర్థులు, నెరవేరని హామీలే ప్రధాన అవరోధంగా మారాయి. ప్రజలు, ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ఏం చెప్పాలో తెలియక టీఆర్ఎస్ అభ్యర్థులు వెళ్లిపోతున్నారు. ఇది ఓటింగ్ పై ప్రభావం చూపుతుందా.? కేసీఆర్ పార్టీకి నష్టం జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.