Begin typing your search above and press return to search.

లక్ష కానీ బ్యాంకు నుంచి విత్ డ్రా చేయాలంటే..

By:  Tupaki Desk   |   20 Nov 2016 5:20 AM GMT
లక్ష కానీ బ్యాంకు నుంచి విత్ డ్రా చేయాలంటే..
X
మీరీ కోణంలో ఆలోచించారో లేదో కానీ.. రూ.లక్ష మొత్తాన్ని విత్ డ్రా చేయాలనుకుంటే ఎన్ని రోజులు పడుతుందో చెప్పగలరా? అన్న ప్రశ్న వేస్తే.. చటుక్కున నెల రోజులు అని చెప్పేస్తారు.అదెలా అంటే.. వారానికి రూ.24వేల చొప్పున నాలుగు వారాలు ప్రయత్నిస్తే.. రూ.96 వేలు వచ్చేస్తాయని చెబుతారు. అది నిజమేనా? అన్నది బ్యాంకుల వద్దకు ఒక్కసారి వెళ్లి చెక్ చేసుకుంటే అసలు విషయం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

ఒక ఖాతాదారుడు తమ ఖాతాలో ఉన్న డిపాజిట్ మొత్తంలో వారానికి రూ.24వేల మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వీలుంది. వినటానికి బాగానే ఉన్నా.. వాస్తవంలోకి వచ్చేసరికి ఇదెంత వరకూ వర్క్ వుట్ అవుతుందన్నది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఒక సాదాసీదా సామాన్యుడు బ్యాంకు వద్దకు విత్ డ్రా చేసుకోవటానికి వెళితే.. ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని బ్రాంచులు నగదు లేద‌ని లోపలకు కూడా రానివ్వకుండా తిప్పి పంపితే.. మరికొన్ని బ్యాంకులు అయితే.. తమకు నగదు షార్టేజ్ ఉందని.. రూ.3వేలు మాత్రమే (కొన్ని బ్యాంకుల్లో అయితే రూ.2వేలు మాత్రమే. హైదరాబాద్ లోని పలు బ్యాంకుల్లో శనివారం ఇదే పరిస్థితి నెలకొని ఉంది) ఇస్తామని చెబుతున్నారు. అంటే.. వారానికి రూ.3వేల చొప్పున డ్రా చేసుకోగలిగితే.. నెల మొత్తంలో డ్రా చేసుకునేది కేవలం రూ.12వేలు మాత్రమే. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. వారంలో రూ.24వేలు డ్రా చేసుకునే వీలున్నా.. ఆఫీసుకు సెలవు పెట్టి రోజు రెండు.. మూడు గంటలు సమయం వెచ్చించి డబ్బులు డ్రా చేయలేం కాబట్టి.. సెలవు రోజును ప్రాతిపదికగా తీసుకుంటే ఈ మొత్తం మాత్రమే చేతికి అందుతుంది.

ఒకవేళ ఆదివారం మాత్రమే సెలవు రోజు అయిన వారికి మాత్రం చుక్కలు కనిపించాల్సిందే. అలా కాదు.. రోజు బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలుచొని.. వారు ఎంత ఇస్తే అంత మొత్తాన్ని తీసుకుందామని అనుకున్నా.. రోజుకు రూ.3 వేలు చొప్పున ఆరు రోజులకు రూ.18వేలు మాత్రమే తీసుకునే వీలుంది. అంటే వారం మొత్తం ప్రయత్నించినా చేతికి రూ.20వేలు కూడా రాదు. ఇలా కాదు.. మరింకేదైనా మార్గం ఉందా? అని చూస్తే..పెద్దపెద్ద నగరాల్లో వేర్వేరు బ్రాంచుల్లోకి వెళ్లి నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు. ఇది కాస్త చిరాకుతో కూడుకున్న పని. ఎందుకంటే.. ప్రతి బ్యాంకులోనూ చాంతాడంత క్యూలు ఉన్న నేపథ్యంలో.. గంట.. రెండేసి గంటలు నిలుచొని రూ.3వేలు.. రూ.2వేల చొప్పున తెచ్చుకుంటే.. రోజులో ఎంత మొత్తాన్ని తీసుకోగలుగుతారని చూస్తే.. రెండు మూడు చోట్లకు మించి వెళ్లలేరు. అంటే.. రూ.10వేలుకూడా చేతికి రాని పరిస్థితి. నగరాలు.. పట్టణాల్లో ఇలాంటి సౌలభ్యం ఉంటుందేమో కానీ.. చిన్న ఊళ్లల్లో ఒక్క బ్రాంచ్ ఉన్న ఊళ్లలో అయితే ఇది కూడా సాధ్యం కాదు.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే పలు బ్యాంకుల వారు.. తమ బ్రాంచ్ వారికి మాత్రమే సేవలు అందించగలమంటూ చిత్రమైన వాదనను వినిపిస్తున్నారు. దీన్ని బ్యాంకు ఉన్నతాధికారులు తీవ్రంగా తప్పు పడుతున్నప్పటికీ.. కొన్ని బ్యాంకుల్లో ఇలాంటి తీరును అధికారులు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన మానాన తాను బతికే సగటు జీవి ఏదైనా అవసరం వచ్చి తన అకౌంట్లో ఉన్న రూ.లక్ష మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలంటే నెల రోజుల కంటే ఎక్కువ పట్టే పరిస్థితి. వినటానికి నిజమా? అన్నట్లుగా ఉన్నా.. వాస్తవం మాత్రం ఇదేనని చెప్పక తప్పదు. ఒకవేళ నమ్మకం కలగకపోతే.. మీకు దగ్గర్లో ఉన్న బ్యాంకుల వద్దకువెళ్లి ప్రయత్నం చేయండి.. సమస్య ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/