Begin typing your search above and press return to search.

అమిత్ షా.. సంఘ్ పరివార్ సేవలపై షాకింగ్ నిజాలు చెప్పిన డిగ్గీరాజా

By:  Tupaki Desk   |   1 Oct 2021 4:33 AM GMT
అమిత్ షా.. సంఘ్ పరివార్ సేవలపై షాకింగ్ నిజాలు చెప్పిన డిగ్గీరాజా
X
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అంతకు మించిన ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే తత్త్వం.. నిజాయితీగా వ్యవహరించే పాత రాజకీయ నేతల్లో ఒకరిగా చెబుతూ ఉండే మాజీ ముఖ్యమంత్రి కమ్ మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ నోటి నుంచి తాజాగా వచ్చిన కొన్ని వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఈ తరహా రాజకీయం తెలుగు నేల మీద కనిపించే అవకాశం ఉందా? అన్న సందేహం కలుగక మానదు. ప్రత్యర్థులకు షాకిచ్చే అవకాశం వచ్చినంతనే.. నిర్మోహమాటంగా మారిని దెబ్బేసేందుకు.. వారి క్యారెక్టర్ ను బద్నాం చేయటమే కాదు.. వారికి తరచూ అవరోధాలు ఎదురయ్యేలా చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా మన కలలో కూడా ఊహించని రీతిలో రాజకీయం ఉంటుందన్న విషయం తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాటల్ని చూసినప్పుటు కనిపించక మానదు.

రాజకీయాల్లో ప్రత్యర్థులపై అవకాశం వచ్చినప్పుడల్లా నిప్పులు చెరగటం ఖాయం. కానీ.. వాటిని రాజకీయాల వరకే పరిమితం చేయటం.. వ్యక్తిగత స్థాయిల్లో అందుకు భిన్నంగా వ్యవహరించే ధోరణి గతంలో తెలుగు నేల మీద పుష్కలంగా ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు పరిణామాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. తనకు ఆజన్మ శత్రువులైన బీజేపీ.. ఆర్ఎస్ఎస్ లు తనకు చేసిన సాయాల గురించి దిగ్విజయ్ సింగ్ తాజాగా చెప్పుకొచ్చారు.

నాలుగేళ్ల క్రితం తాను చేపట్టిన నర్మద పరిక్రమ (తీర్థయాత్ర) సందర్భంగా బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా.. సంఘ్ కార్యకర్తలు తమకెంతోసాయం చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. దీనికి వేదికగా.. తనకు దీర్ఘకాల సహచరుడైన ఓపీ శర్మ రాసిన నర్మద పాఠిక్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిలిచింది. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ప్రస్తావించిన అంశాలు ఆసక్తికరంగా అనిపించక మానదు.

తన భార్యతో కలిసి దిగ్విజయ్ సింగ్ 2017లో తీర్థయాత్ర చేపట్టారు. ఆ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. ‘ఒక రోజు రాత్రి పది గంటల సమయంలో మేం గుజరాత్ లోని గమ్యస్థానాన్ని చేరుకున్నాం. అది అటవీ ప్రాంతం కావటంతో ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఆ రాత్రి అక్కడ ఉందామంటే అంత సౌకర్యం లేదు. ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటి వేళ ఒక అటవీ అధికారి అకస్మాత్తుగా మా ముందుకు వచ్చారు. మాకు పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ అమిత్ షా పంపారని చెబితే ఆశ్చర్యపోయాం. అప్పట్లో గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. దిగ్విజయ్ సింగ్ పెద్ద విమర్శకుడు. అయినప్పటికి యాత్రలో మేం ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నట్లుగా అమిత్ షా మమ్మల్ని చూసుకున్నారు. పర్వతాల మీదుగా దారిని చూపటమే కాదు.. మా అందరిని ఆహారాన్ని ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు.

2017 సెప్టెంబరులో దిగ్విజయ్ మొదలు పెట్టిన మూడు వేల కిలోమీటర్ల నర్మద పరిక్రమ యాత్ర దాదాపు ఆరునెలల పాటు సాగింది. ఇలా తనకు ఎంతో సాయం చేసిన అమిత్ షాను తాను ఇప్పటివరకు కలవలేదన్నారు. చేసిన సాయానికి పలురకాలుగా ఆయనకు థ్యాంక్స్ చెప్పానన్న ఆయన.. ‘రాజకీయ సమన్వయం.. సర్దుకుపోవటం.. స్నేహానికి రాజకీయాలు.. భావజాలం అడ్డం కాబోవనటానికి ఇదో ఉదాహరణ’ అని చెప్పారు. మరో ఉదంతంలో తాము భరూచ్ మీదుగా వెళుతున్నప్పుడు సంఘ్ వర్గీయులు తమ టీంకు మాంఝీ సమాజ్ ధర్మశాలలోవిడిది ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

తాము బస చేసిన హోటల్ గదిలో.. తన సిద్ధాంతానికి ఏ మాత్రం సరిపోని సంఘ్ యోధులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్.. మాధవరావ్ సదాశివరావ్ గోల్వాల్కర్ తదితరుల ఫోటోలు ఉండేవన్న దిగ్విజయ్.. రాజకీయాలు.. మతాలు వేరన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్న కీలక వ్యాఖ్య చేశారు. ఆ గీత తుడిచేసిన తెలుగు రాజకీయాల్లో ఈ తరహా పరిస్థితులు ఎప్పటికి మళ్లీ వస్తాయో?