Begin typing your search above and press return to search.

భేటీల కాలం; రామోజీని కలిసిన డిగ్గీరాజా

By:  Tupaki Desk   |   21 Oct 2015 6:17 AM GMT
భేటీల కాలం; రామోజీని కలిసిన డిగ్గీరాజా
X
ఇటీవల కాలంలో రామోజీ సంస్థల అధినేత రామోజీరావును కలుసుకునే ప్రముఖుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతోంది. వ్యక్తిగత.. రాజకీయ కారణాలు ఏమైనా వారూ.. వీరు అన్న తేడా లేకుండా బడా బడా నేతలంతా రామోజీని కలవటం ఆసక్తికరంగా మారింది.

ఎవరినీ పెద్దగా పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి రామోజీరావు నివసించే రామోజీ ఫిలింసిటీకి వెళ్లి దాదాపు ఐదారు గంటలు గడిపిన సంగతి తెలిసిందే. విపక్ష నేతలు ఐదు నిమిషాలు కలిసేందుకు గంటల తరబడి వెయిట్ చేసినా సమయం ఇవ్వని కేసీఆర్.. రామోజీతో ఐదారు గంటలు గడపటం గమనార్హం.

కేసీఆర్ కలవటం పెద్ద విశేషం లేదనుకుంటే.. రామోజీకి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ సైతం రామోజీతో ఇటీవల భేటీ కావటం తెలిసిందే. దాదాపు గంట పాటు వీరి సమావేశం నడించింది. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాఫ్టర్లలో రామోజీ ఫిలింసిటీకి వచ్చి మరీ.. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించటం తెలిసిందే.

ఇలా కీలక రాజకీయ నేతలు రామోజీ ఫిలింసిటీకి వచ్చి రామోజీతో భేటీ కావటం ఈ మధ్య తరచూ జరుగుతున్న పరిణామం. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన దిగ్విజయ్ సింగ్ మంగళవారం రామోజీరావును కలవటం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీని తాను వ్యతిరేకిస్తానని.. తనకు ఆ పార్టీకి పడదంటూ కోర్టులో అఫిడవిట్ సమర్పించిన రామోజీతో భేటీ అయ్యేందుకు డిగ్గీరాజా వెనుకాడకపోవటం చూసినప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఫీడ్ బ్యాక్ కోసమే డిగ్గీ రాజా తాజా భేటీగా చెబుతున్నారు.

ఈ వాదనకు బలం చేకూరుస్తూ ఈనాడు అధినేతతో పాటు.. ఆంధ్రజ్యోతి.. సియాసత్ మీడియా సంస్థల అధినేతలతోనూ ఆయన భేటీ కావటం గమనార్హం. డిగ్గీరాజాతో పాటు ఆయన వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నట్లుగా చెబుతున్నారు. తమకు వ్యతిరేకంగా మారిన మీడియాను మార్చుకునే పనిలో భాగంగానే ప్రముఖ మీడియా సంస్థల అధినేతలతో భేటీ అవుతున్నట్లుగా చెబుతున్నారు. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నప్పటికీ.. ఇదే మర్యాద రాష్ట్ర విభజన లాంటి కీలక సమయాల్లో ఎందుకు భేటీలు నిర్వహించలేదో..?