Begin typing your search above and press return to search.

డ‌బ్బు కోసమే ఓవైసీ పోటీ...దిగ్విజ‌య్ క‌లకలం

By:  Tupaki Desk   |   21 Dec 2018 5:27 PM GMT
డ‌బ్బు కోసమే ఓవైసీ పోటీ...దిగ్విజ‌య్ క‌లకలం
X
కాంగ్రెస్ సీనియర్ నేత - వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సుప‌రిచితులు అయిన దిగ్విజయ్‌ సింగ్ మ‌రోమారు అనూహ్య రీతిలో వార్త‌ల్లో నిలిచారు. నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇందుకు కార‌ణం ఎంఐఎం అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఒవైసీపై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం. డబ్బు కోసమే అసదుద్దిన్ ఒవైసీ వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తారని దిగ్విజయ్ సింగ్ ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. దీనిపై ఎంఐఎం భ‌గ్గుమంది.

ఎంఐఎం ప‌రువు తీసేలా దిగ్విజయ్ సింగ్ వ్యాఖఖ్యానించారంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ పరువునష్టం కేసు వేశారు. అయితే - కేసు విచారణకు దిగ్విజ‌య్‌ సింగ్ హాజ‌రు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, దీనిపై దిగ్విజ‌య్ స్పందించాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గా - మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న కేసులో పుణె పోలీసులు డిగ్గీ రాజాను ప్రశ్నించేందుకు సిద్ధ‌మైన సంగ‌త తెలిసిందే. ఈ మధ్య మావోయిస్టుల దగ్గర బయటపడిన లేఖలో దొరికిన ఫోన్ నంబర్ దిగ్విజయ్‌ దేనని పోలీసులు నిర్ధారించారు. దిగ్విజయ్‌ను స్నేహితుడిగా చెబుతూ ఆయన ఫోన్ నంబర్‌ను ఆ లేఖలో మావోయిస్టులు రాయడం విశేషం. పుణె డీసీపీ సుహాస్ భావ్చె కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ కేసులో ఇంకా చాలా వరకు విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెప్పారు. ఇప్పుడు దిగ్విజయ్‌ను కూడా పిలిచి విచారిస్తామని వాళ్లు స్పష్టం చేశారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడంలో తమకు సహకరించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నట్లు కమాండర్ సురేంద్రకు రాసిన లేఖలో కమాండర్ ప్రకాశ్ వెల్లడించాడు. దీంతో ఆయ‌న్ను విచారించేందుకు పోలీసులు సిద్ధ‌మ‌య్యారు.