Begin typing your search above and press return to search.

పాక్ ను వదిలేసి మీడియాను ఏసుకున్నాడే

By:  Tupaki Desk   |   20 Jan 2016 6:54 AM GMT
పాక్ ను వదిలేసి మీడియాను ఏసుకున్నాడే
X
అధికారిక మీడియా సమావేశంలో పాక్ ఉన్నతాధికారులు ఒక విషయాన్ని ప్రకటిస్తే.. ఆ విషయాన్ని మీడియా ప్రచురించాలా? వద్దా? అధికారికంగా వెల్లడించిన విషయాలపై స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత మాత్రమే.. మీడియా సమావేశాన్ని టెలికాస్ట్ చేస్తామని ఎక్కడైనా చెబుతారా? ఇలాంటి విషయాల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి బంటు అయిన డిగ్గీ రాజా పెద్దగా పట్టించుకోవటం లేదు. నమ్మబలికి మోసం చేసిన పాక్ మాటల్ని చెప్పిన మీడియాను విమర్శిస్తున్న ఆయన.. తప్పుడు మాటలు చెప్పే పాక్ ను మాత్రం పెద్దగా తిట్టకపోవటం గమనార్హం.

జేషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ను అరెస్ట్ చేసినట్లుగా పాక్ సర్కారు ప్రతినిదులు ప్రకటించారు. ఈ విషయంపై మీడియా కథనాలు ప్రసారం చేశాయి. ఆ తర్వాత అదంతా నిజం కాదని.. అబద్ధమని తేలింది. ఇదంతా పాక్ సర్కారు చేసిన మోసం కారణంగా జరిగిందే తప్ప మరొకటి కాదు. కానీ.. ఈ విషయాన్ని ప్రస్తావించని దిగ్విజయ్ సింగ్.. అసలు వదిలేసి కొసరు లాంటి మీడియాను దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు.

మసూద్ అరెస్ట్ విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రసారం చేశారని.. ఇలా చేసి భారత మీడియా అభాసుపాలైందని దిగ్విజయ్ సింగ్ దుయ్యబట్టారు. సంచలనాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇలాంటి కథనాలు ప్రసారం చేసిందంటూ వ్యాఖ్యానించారు. అంతేకానీ.. పాక్ నమ్మక ద్రోహం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న మాట డిగ్గీ రాజా నోటి వెంట రావటం లేదెందుకో..?