Begin typing your search above and press return to search.

లోపలే తన్నుకోండర్రా.. కాంగ్రెస్ సీనియర్లు డిగ్గీ హితబోధ

By:  Tupaki Desk   |   23 Dec 2022 10:33 AM GMT
లోపలే తన్నుకోండర్రా.. కాంగ్రెస్ సీనియర్లు డిగ్గీ హితబోధ
X
కాంగ్రెస్ అంటేనే ఒక అంతులేని సముద్రం. అందులో వందలాది చేపలు ఎదిగాయి. తిమింగాలాలంత పెద్దవి అయ్యాయి. ప్రపంచంలోని ఏ పార్టీలో లేనంత స్వేచ్ఛ అందులో ఉంటుంది. ఎవరు ఏమైనా వాగొచ్చు. గోల చేయవచ్చు. సొంత పార్టీలోనే ఉంటూ అసమ్మతి రాజేయవచ్చు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి బీజేపీలో ఉన్న తన సొంత తమ్ముడి తరుఫున ప్రచారం చేశాడు. అయినా ఇప్పటివరకూ వెంకట్ రెడ్డిపై చర్యలు లేవు. అదీ కాంగ్రెస్ అంటే..

కాంగ్రెస్ ను ఎవరో వచ్చి ముంచాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారు. తాజాగా రేవంత్ రెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ సీనియర్లను బుజ్జగించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ వృద్ధ పిండం దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 'కలిసి ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలమని నేతలకు 'హితబోధ చేశారు.

ఇలా వీధుల్లో పడి కొట్టుకొని తిట్టుకుంటే మీరూ గెలవరు.. పార్టీ గెలవదని సంచలన కామెంట్స్ చేశారు.

'మీరందరికీ చేతులు జోడించి కోరుతున్నా.. సమస్యలుంటే అంతర్గతం చర్చించండి.. బయటకు చెప్పొద్దని అంతటి దిగ్విజయ్ సింగ్ లాంటి నేత కూడా మన తెలంగాణ కాంగ్రెస్ నేతలను బతిమిలాడాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీలో విభేదాలపై 'ఆల్ సెటిల్డ్.. నో ప్రాబ్లమ్' అని తేల్చేశాడు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని దించాలన్నది కాంగ్రెస్ సీనియర్ల డిమాండ్. అధిష్టానం నియమించిన ఆయన్ను దించే పని మాత్రం కాదని డిగ్గీ కాంగ్రెస్ సీనియర్లకు స్పష్టం చేసినట్టు సమాచారం. అందుకే మీరు సైలెంట్ గా ఉండి పార్టీని అధికారంలోకి తేవడం తప్ప మరో ఆప్షన్ లేదని.. లోపల ఎంతైనా తన్నుకోండి కానీ బయటపడొద్దని డిగ్గీ సూచించిన మాట..

అయినా ఇంతటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలున్న కాంగ్రెస్ లో దిగ్విజయ్ కాదు కదా.. సోనియా వచ్చి చెప్పినా వినే నాథుడే లేడు. మొన్న రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చినప్పుడే ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఈ డిగ్గీ రాజా ఒక లెక్కనా నేతలకు.. మరి ఈ హితబోధకైనా తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు బాగుపడుతాయో లేవో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.