Begin typing your search above and press return to search.

డిగ్గీరాజా మరీ అంత అమాయకంగా మాట్లాడారే?

By:  Tupaki Desk   |   2 July 2015 4:38 AM GMT
డిగ్గీరాజా మరీ అంత అమాయకంగా మాట్లాడారే?
X
రాజకీయాల గురించి కూసింత అవగాహన ఉన్న వారు సైతం.. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డి.శ్రీనివాస్‌ తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లిపోతారన్న విషయాన్ని చెప్పేస్తుంటే.. చిత్రంగా కాంగ్రెస్‌ అధినాయకత్వానికి సన్నిహితంగా మెలిగి.. తెలుగు రాజకీయాల గురించి ఫస్ట్‌హ్యాండ్‌ ఇన్ఫర్మేషన్‌ సేకరించే దిగ్విజయ్‌సింగ్‌ మాత్రం మరోలా స్పందిస్తున్నారు.

పార్టీ వీడిపోతున్నారన్న ప్రచారం జరుగుతున్నట్లుగా డీఎస్‌ పార్టీని విడిచి పెడతారని తాను అనుకోవటం లేదని డిగ్గీరాజా వ్యాఖ్యానించటం విశేషం. ఇక.. తనకు పదవులు దక్కలేదన్న ఆరోపణ చేసిన డీఎస్‌ మాటకు వివరణ ఇచ్చే ప్రయత్నం డిగ్గీ రాజా చేశారు. అంతేకాదు.. డీఎస్‌కు తొమ్మిది సార్లు టిక్కెట్టు ఇస్తే మూడుసార్లు మాత్రమే గెలిచారన్న వ్యాఖ్య చేశారు.

గతంలో పలుమార్లు ఎన్నికల్లో ఓడినా డీఎస్‌కు పదవులు దక్కాయని.. ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వాలని భావించటంతో మహిళను ఎంపిక చేశామే తప్పించి మరొకటి లేదని చెప్పారు. చివరకు సదరు మహిళా ప్రతినిధిని కూడా డీఎస్సే ప్రతిపాదించారంటూ కుండబద్ధలు కొట్టారు.

సీనియర్లు పార్టీని విడిచి పెట్టి వెళ్లటం అవకాశవాదమేనన్న డిగ్గీరాజా.. డీఎస్‌ పార్టీ వీడతారని తాను అనుకోవటం లేదని.. ఆయన కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్నారని.. పార్టీ కూడా ఆయన్ని సముచితంగా గౌరవించిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తలపండిన డిగ్గీరాజా కూడా ఇలా వ్యాఖ్యలు చేయటం ఏమిటి? దింపుడు కళ్లెం ఆశలా..? లేక.. పార్టీ ఆయన పట్ల ఎంత నమ్మకం పెట్టుకుందన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నమా..?