Begin typing your search above and press return to search.

అంద‌ర్ని ఓటేయ‌మ‌న్న ఆయ‌న‌.. ఓటేయ‌లేదు!

By:  Tupaki Desk   |   13 May 2019 8:18 AM GMT
అంద‌ర్ని ఓటేయ‌మ‌న్న ఆయ‌న‌.. ఓటేయ‌లేదు!
X
తెలిసినా.. తెలియ‌కున్నా.. ప‌రిచ‌యం లేకున్నా.. క‌నిపించిన ప్ర‌తిఒక్క‌రిని అయ్యా.. బాబు..అమ్మా.. త‌ల్లి.. ఓటు వేయండి.. అస్స‌లు బ‌ద్ధ‌కం వ‌ద్దు. ఆదివార‌మ‌ని రిలాక్స్ కావొద్దు. ఓటు వేసిన త‌ర్వాత మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఎంజాయ్ చేయండి.. ముందు మాత్రం ఓటేయండంటూ చెప్పుకున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. భోపాల్ ఎంపీ అభ్య‌ర్థి దిగ్విజ‌య్ సింగ్ మాత్రం త‌న ఓటుహ‌క్కును వినియోగించుకోక‌పోవ‌టం విశేషం.

పోలింగ్ ముగిసే స‌మ‌యానికి ఆయ‌న తాను ఓటు వేయాల్సిన ప్రాంతానికి చేరుకోలేక‌పోవ‌టంతో ఆయ‌న ఓటు వేయ‌లేక‌పోయారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని రాజ్ ఘ‌ర్ ఓట‌ర్ల జాబితాలో డిగ్గీరాజా ఓటు ఉంది. తానుండే భోపాల్ కు సుమారు 130 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఉద‌యం మొద‌లు సాయంత్రం వ‌ర‌కు తాను బ‌రిలో ఉన్న భోపాల్ లో పోలింగ్ స‌ర‌ళి ని ప‌రిశీలిస్తూ తిరిగిన డిగ్గీ.. త‌న ఓటు వేసే విష‌యంలో మాత్రం నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

సాయంత్రం వ‌ర‌కూ పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించిన ఆయ‌న పోలింగ్ ముగిసే స‌మ‌యానికి త‌న ఓటు హ‌క్కును వినియోగించ‌టానికి బ‌య‌లుదేరినా.. స‌కాలంలో ఆయ‌న పోలింగ్ బూత్ కు చేరుకోలేక‌పోయారు. తాను ఓటు వేయ‌క‌పోవ‌టంపై విచారం వ్య‌క్తం చేసిన దిగ్విజ‌య్.. ఈసారి ఎన్నిక‌ల నాటికి త‌న ఓటును భోపాల్ కు తెచ్చుకోనున్న‌ట్లు చెప్పారు. అదేదో ఈసారే తెచ్చుకుంటే స‌రిపోయేది అంద‌రిని ఓటు అడిగిన డిగ్గీ.. త‌న ఓటు వేసే విష‌యంలో అంతే క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శించి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.