Begin typing your search above and press return to search.

బాబుపై చార్జిషీట్ రెడీ!

By:  Tupaki Desk   |   9 April 2017 8:13 AM GMT
బాబుపై చార్జిషీట్ రెడీ!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. అధికారంలోనికి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానాలు చేసిన చంద్రబాబు మాట తప్పారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న అనంత‌రం దిగ్విజ‌య్ మాట్లాడుతూ కమీషన్ల కోసమే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేస్తోంద‌ని విమర్శించారు. అయిన‌ప్ప‌టికీ త‌న‌కు లాభం క‌లుగుతుంది కాబ‌ట్టే బాబు ప్యాకేజీకి ఒప్పుకున్నార‌ని మండిప‌డ్డారు.2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీకి వెళ్తుందని చెప్పారు. ప్రజల సహకారముంటే తప్పకుండా గెలుస్తామని దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు వైఫల్యాలపై జూన్‌ 8న పీసీసీ ప్రజా చార్జిషీట్‌ ను విడుదల చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీ కూడా నేరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్న ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. అందుకే తాము చార్జిషీట్ రూపంలో ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గతంలో మాట్లాడిన చంద్రబాబు, ప్యాకేజీయే మంచిదంటూ ఇప్పుడు ప్రచారం చేయడం వంటి అంశాలపై గ్రామ స్థాయిలో ప్రజల అభిప్రాయల్ని సేకరిస్తామన్నారు. అనంతరం జూన్‌ 8న ప్రజా చార్జిషిట్‌ను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతు, కౌలు రైతుల ఆత్మహ త్యలపై క్షేత్రస్థాయిలో పీసీసీ ఉద్యమ బాట చేపడుతుందని ర‌ఘువీరా రెడ్డి వెల్ల‌డించారు.

కాగా, టీడీపీ హామీల అమలులో వైఫ‌ల్యం, ప్రత్యేక హోదాపై బీసెంట్‌ రోడ్డులో ఏపీ కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ చేపట్టిన సంద‌ర్భంగా ఇద్దరు నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లక్ష్మీపై నగర పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు చేయిచేసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రజా బ్యాలెట్‌ వివాదం పంచాయతీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వద్దకు చేరింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/