Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో మరో సీఎం

By:  Tupaki Desk   |   27 Jun 2015 4:49 AM GMT
ఓటుకు నోటు కేసులో మరో సీఎం
X
ఓటుకు నోటు...ఎన్నికల్లో మా పార్టీకే వేయాలి మీ ఓటు అంటూ తెలుగురాష్ర్టాల్లో జరిగిన సీను సితారా అయిపోయి ఇరు రాష్ర్టాల మధ్య గ్యాప్ పెంచే స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించడం...ఈ క్రమంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాత్ర ఉందనే టేపులు విడుదల అవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 పేరుతో పెద్ద ఎత్తున్నే చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన ఓటుకు నోటు ఎపిసోడ్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించగా సరిగ్గా అలాంటి ఎపిసోడే మధ్యప్రదేశ్ లో జరిగిందట. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉభయ తెలుగు రాష్ర్టాల ఇన్ చార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ ఈ మేరకు టేపులు విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లా గోరాథ్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించాల్సిందిగా స్థానిక బీజేపీ నేత రాజేశ్‌ చౌదరిని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ ఫోన్‌లో కోరుతున్న సంభాషణల టేపులను డిగ్గీరాజ బయటపెట్టారు. వాటిని ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో విడుదల చేశారు. గోరాథ్‌ స్థానానికి పోలింగ్‌ జరగడానికి ఒకరోజు ముందు ఈ టేపులు విడుదల చేశారు.

'ఎన్నికల్లో మన అభ్యర్థి తప్పకుండా గెలవాలి. ఇందుకు నువ్వు సహకరించాలి. నిన్ను జాగ్రత్తగా చూసుకునే హామీ నాది' అంటూ రాజేశ్‌ చౌదరిని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కోరుతున్నట్లుగా టేపుల్లో ఉంది. అయితే డిగ్గి టేపుల విడుదల అనంతరం ఎంపీ సీఎం చేసింది అక్రమం అంటూ కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఇదంతా దిగ్విజయ్‌ సింగ్‌ ‘డర్టీ పాలిటిక్స్‌’లో భాగమని బీజేపీ నేతలు మండిపడ్డారు. మొత్తంగా ఆసక్తికర అంశం ఏమంటే సొంత పార్టీ అయిన బీజేపీ నేతకు సీఎం స్థాయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మాట్లాడితే అది పార్టీ అంతర్గత విషయమే తప్ప ఓటుకు నోటుగా తప్పు పట్టే అంశం ఎలా అవుతుంది? డిగ్గీ రాజా మరోమారు మీడియాను ఆకర్షించేందుకే ఇలా చేశారా అనే ఆసక్తికరంగా మారింది.