Begin typing your search above and press return to search.

దాడికి ప్రతీకారం తీర్చుకుంటార.. వడ్డీతో సహా చెల్లిస్తారట

By:  Tupaki Desk   |   11 Dec 2020 10:43 AM GMT
దాడికి ప్రతీకారం తీర్చుకుంటార.. వడ్డీతో సహా చెల్లిస్తారట
X
విశేష అధికారాల్ని అరచేతిలో ఉన్న అంత పెద్ద మోడీ ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పెద్ద మనిషి మీద ఒక రాష్ట్ర అధికారపక్షానికి చెందిన సానుభూతి పరులు దాడి చేయటం.. ఆ సందర్భంగా బుల్లెట్ ఫ్రూప్ వాహనం సైతం భారీగా డ్యామేజ్ కావటానికి మించిన సీరియస్ సంఘటన ఇంకేం ఉంటుంది. నిన్నటి రోజున పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనల్ని క్రియేట్ చేస్తోంది.

తమ పార్టీ జాతీయ అధ్యక్షుడి వాహనంపై దాడి చేయటాన్ని బీజేపీ నేతలు.. ఆ పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకొంటోంది. కొద్ది నెలల్లో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఈ దాడి ఉదంతం రాజకీయ అంశంగా మారింది. రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై తాజాగా బెంగాల్ గవర్నర్ ధన్కర్ స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెప్పీ నడ్డా ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన దాడిని ఆయన అత్యంత దురదృష్టకరమని అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చగా పేర్కొన్నారు. నిప్పుతో చెలగాటం ఆడరాదని ఆయన తీవ్రస్వరంతో పేర్కొన్న వైనం చూస్తే.. ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేసినట్లుగా చెప్పాలి. ముఖ్యమంత్రి మమత రాజ్యాంగాన్ని కచ్ఛితంగా పాటించాలన్నారు.

రాజ్యాంగ పంథా ఎట్టి పరిస్థితుల్లో పక్కకు వెళ్లరాదన్న ఆయన.. చాలా రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయన్నారు. బీజేపీ నేతలు బయటి వారంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. బయటవ్యక్తులు అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వారు ఎవరు బయట వ్యక్తులు? అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని ప్రశ్నించారు.

‘‘మేడమ్.. దయచేసి హుందాతనం పాటించండి. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి’’ అని గవర్నర్ ధన్కర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు టీఎంసీ నేతల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. బీజేపీ నేత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. వడ్డీతో సహా చెల్లించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే.. తమ పార్టీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్ పై దాడి ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. బెంగాల్ సీఎస్.. డీజీపీలకు సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. వారు నివేదిక పంపాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. మరో బీజేపీ నేత దిలీప్ ఘోష్ మరింత ఆగ్రహంతో స్పందించారు. టీఎంసీ నేతలు తమను ఒకరిని చంపితే.. తాము నలుగురిని చంపుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. నడ్డాపై టీఎంసీ నేతలు దాడి చేయటాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అదే సమయంలో.. తమ నాయకుడి కాన్వాయ్ మీద దాడికి పాల్పడిన టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి చెందిన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దానిపై బీజేపీ నేతలు ఈ రోజు దాడి చేశారు. అనంతరం వారు.. ఇది ఆరంభం మాత్రమేనని.. రానున్న రోజుల్లో చాలా ఉంటాయన్న వ్యాఖ్య ఇప్పుడు పెను దుమారంగా మారుతోంది. చూస్తుంటే.. బెంగాల్ లో కొత్త పరిణామాలకు అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.