Begin typing your search above and press return to search.

కోడ‌ళ్ల పోరే.... ములాయం కొంప ముంచిందా?

By:  Tupaki Desk   |   5 Jan 2017 6:43 AM GMT
కోడ‌ళ్ల పోరే.... ములాయం కొంప ముంచిందా?
X
ఉత్త‌రప్ర‌దేశ్‌... దేశ రాజ‌కీయాల్లో కీల‌క రాష్ట్రం. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తే... కేంద్రంలో కూడా ఆ పార్టీదే కీల‌క భూమిక అన్న వాద‌న ఎన్నాళ్ల నుంచో వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్‌ - బీజేపీ వంటి జాతీయ పార్టీలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దాదాపుగా సెమీ ఫైన‌ల్స్‌గా ప‌రిగ‌ణిస్తున్న ప‌రిస్థితి. ఇప్పుడు కూడా అదే త‌ర‌హా ప‌రిస్థితి నెల‌కొంది. వ‌చ్చే నెల‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న విడ‌త‌ల‌వారీ ఎన్నిక‌ల్లో విజ‌యం వ‌రించే పార్టీ... ఆ త‌ర్వాత వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. ఇంతటి కీల‌క త‌రుణంలో ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుత అధికార పార్టీ స‌మాజ్ వాదీలో పెను ముస‌ల‌మే నెల‌కొంది. పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాద‌వ్‌ - సీఎం అఖిలేశ్ యాద‌వ్‌ లు బ‌హిరంగంగానే క‌త్తులు దూసుకున్నారు. పార్టీ చీఫ్ హోదాలో కుమారుడు అఖిలేశ్‌ నే ములాయం గెంటేస్తే... అంత‌కంటే స్పీడుగా స్పందించిన అఖిలేశ్... తండ్రి అని కూడా చూడ‌కుండా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచే ములాయంను పీకేశారు. తండ్రీకొడుకుల మ‌ధ్యే ఈ త‌ర‌హాలో ఇంత పెద్ద స్థాయిలో పోరుకు కార‌ణం తెలిస్తే... మ‌నం షాక్ తిన‌క త‌ప్ప‌దు. ములాయం రెండో భార్య సాధ‌నా గుప్తా కార‌ణంగానే ఈ వివాదానికి బీజం ప‌డింద‌ని తెలిసినా... పార్టీ చీలిపోవ‌డానికి మాత్రం ములాయం ఇద్ద‌రు కోడ‌ళ్లు డింపుల్ యాద‌వ్‌ - అప‌ర్ణ‌లే కార‌ణ‌మ‌ని కొత్త‌గా వెలుగులోకి వ‌చ్చింది.

ఆ వివ‌రాల్లోకెళితే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అప్పుడ‌ప్పుడే తెరంగేట్రం చేసిన అఖిలేశ్ యాద‌వ్‌... తండ్రి ములాయంను మించి జ‌నాన్ని ఆక‌ర్షించారు. ఎస్పీ స‌భ‌లు ఎక్క‌డ జ‌రిగినా... జ‌న‌మంతా అఖిలేశ్ నామాన్ని జ‌పించారు. ఈ క్ర‌మంలో ములాయం ప‌ద‌విని అఖిలేశ్‌ కు అప్ప‌గించ‌డం ఖాయమ‌న్న వాద‌న వినిపించింది. అయితే ములాయం రెండో భార్య సాధ‌న మాత్రం త‌న కుమారుడు ప్ర‌తీక్‌ ను ములాయం వార‌సుడిగా బ‌రిలోకి దింపే య‌త్నం చేశారు. అయితే పాలిటిక్స్‌ పై అంత‌గా ఆస‌క్తి లేని ప్ర‌తీక్‌... రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లిపోయాడు. అయితే అధికారంపై ఆశ చావ‌ని సాధ‌న ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో త‌న‌ను తాను బాగానే ఎలివేట్ చేసుకునే స‌త్తా ఉన్న ప్ర‌తీక్‌ స‌తీమ‌ణి అప‌ర్ణ అమెకు క‌నిపించారు. దీంతో అప‌ర్ణ‌కు బాగానే రాజ‌కీయ పాఠాలు చెప్పిన సాధ‌న‌... ఆమెను బ‌రిలోకి దింపే య‌త్నాన్ని ముమ్మ‌రం చేశారు.

ఈ క్ర‌మంలో అప్ప‌టిదాకా ఓ గృహిణిగానే ఉన్న అఖిలేశ్ స‌తీమ‌ణి డింపుల్ భ‌ర్త సీఎం అయ్యాక ఖాళీ అయిన లోక్‌ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల్సి రావ‌డంతో రాజ‌కీయ తెరంగేట్రం చేశారు. అఖిలేశ్ హ‌వాతో ఆ ఉప ఎన్నిక‌లో డింపుల్ సునాయ‌స విజ‌యాన్నే న‌మోదు చేశారు. అప్ప‌టిదాకా రాజ‌కీయ వాస‌న‌లు తెలియ‌ని డింపుల్... ఎంపీగా మారాక మాట‌లు నేర్చారు. రాజ‌కీయ చ‌ద‌రంగంపై ప‌ట్టు కూడా సాధించారు. ఈ క్ర‌మంలో అప‌ర్ణ‌ను బ‌రిలోకి దింపేసి అఖిలేశ్‌ కు మంట పెట్టేందుకు తెర వెనుక నుంచి సాధ‌న చేస్తున్న రాజ‌కీయాన్ని డింపుల్ గుర్తించేశారు. విష‌యాన్ని భ‌ర్త చెవిన వేసి జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే ఇబ్బందేన‌ని హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలో తండ్రికి మ‌రింత ద‌గ్గ‌రైన అఖిలేశ్... నిత్యం పార్టీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపారు. అయినా త‌న సోద‌రుడు శివ‌పాల్ యాద‌వ్ వైపే ములాయం ముగ్గు చూపుతున్న‌ట్లుగా క‌నిపించారు. ఈ క్ర‌మంలోనే అఖిలేశ్‌ కు - త‌న కేబినెట్‌ లో కీల‌క మంత్రిగా ఉన్న‌ త‌న బాబాయి శివ‌పాల్‌ కు త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగాయి. ఇక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌... అప‌ర్ణ మ‌రింత‌గా యాక్టివేట్ అయ్యారు. ల‌క్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టికే సాధ‌న వ‌ర్గంగా మారిపోయిన శివ‌పాల్... ఆమె అడ‌గ్గానే ఆ స్థానాన్ని అప‌ర్ణ‌కు కేటాయించారు. ములాయం ప్ర‌క‌టించిన జాబితాలో ఆ స్థానానికి అపర్ణ పేరే ఉంది. అయితే పార్టీలో చీలిక వ‌చ్చిన నేప‌థ్యంలో అఖిలేశ్ కూడా మ‌రో కొత్త జాబితాను ప్ర‌కటించారు. ఈ జాబితాలో అపర్ణ పేరు లేకపోయినప్ప‌టికీ... కంటోన్మెంట్ స్థానాన్ని మాత్రం ఎవ‌రికీ కేటాయించ‌లేదు. ఇదిలా ఉంటే... డింపుల్ మాదిరి అప‌ర్ణ సైలెంట్ ఉండే ర‌కం కాద‌ట‌. త‌న‌ను తాను బాగానే ఎలివేట్ చేసుకునే సామ‌ర్థ్యం అమె సొంత‌మ‌ట‌. ఇప్ప‌టికే ప్రధాని న‌రేంద్ర మోదీతో పాటు యూపీ రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టున్న బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ తోనూ ఆమె ప‌లుమార్లు భేటీ అయ్యార‌ని, వారి ఆశీస్సులు ఆమెకు పుష్కలంగానే ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే... ఎన్నిక‌లు స‌మీపించే కొద్దీ అప‌ర్ణ త‌న‌దైన శైలిలో స‌త్తా చాటుతార‌న్న‌మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/