Begin typing your search above and press return to search.

అప్పుడు టోపీ - ఇప్పుడు గిఫ్ట్ బాక్స్.. కామెడీగా!

By:  Tupaki Desk   |   29 March 2019 5:28 PM GMT
అప్పుడు టోపీ - ఇప్పుడు గిఫ్ట్ బాక్స్.. కామెడీగా!
X
ఆ మధ్య రద్దు అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంలో దినకరన్ కు టోపీ గుర్తు వచ్చింది. జయలలిత మరణంతో అనివార్యం అయిన ఆర్కే నగర్ బై పోల్ లో దినకరన్ ఒక పార్టీ ని ఏర్పాటు చేసి దాని తరఫున పోటీ చేశాడు. తన పినతల్లి శశికళ ఆశీస్సులతో దినకరన్ తమిళనాడు రాజకీయంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు. అయితే జయలలిత అతడిని అన్నాడీఎంకే వ్యవహారాలకు దూరం పెట్టింది.

అతడి తీరు నచ్చ జయ దూరంగా పెట్టిందని అంటారు. అయితే జయలలిత మరణం తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యాడు దినకరన్. శశికళ తరఫున రాజకీయం చేశాడు. శశికళ జైలు పాలయ్యాకా.. ఆమె వర్గానికి ఇతడే నాయకుడు అయ్యాడు. ఆ పరిణామాల మధ్యన ఆర్కే నగర్ బై పోల్ లో దినకరన్ పోటీ చేశాడు. ఆ సమయంలో ఇతడికి టోపీ గుర్తు వచ్చింది.

ఆ గుర్తు విషయంలో నవ్వుల పాలయ్యాడు దినకరన్. జనాలకు టోపీ పెట్టడానికే అతడు ఆ గుర్తును తెచ్చుకున్నాడనే కామెంట్లు వినిపించాయి. ఏదేమైనా టోపీ గుర్తుతో దినకరన్ గట్టిగానే ప్రచారం చేశాడు. అయితే ఆర్కే నగర్ బై పోల్ రద్దు కావడంతో వీళ్ల టోపీకి పని లేకుండా పోయింది.

ఇక ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దినకరన్ ఏర్పాటు చేసిన పార్టీ పోటీ చేస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థులను నిలుపుతోంది ఈ పార్టీ. దానికి కామన్ సింబల్ కూడా లభించింది. అదే గిఫ్ట్ బాక్స్! ఇదీ దినకరన్ పార్టీ ఎన్నికల గుర్తు. ఎన్నికల వేళ రాజకీయ నేతలు జనాలకు గిఫ్టు బాక్సులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. దినకరన్ కు మాత్రం ఏకంగా గిఫ్ట్ బాక్సే గుర్తుగా వచ్చింది. జనాల మధ్యకు ప్రచారానికి అని గిఫ్ట్ బాక్సులను తీసుకెళ్లి వాటిని పంచి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందని.. ఈ గుర్తు తీసుకున్నట్టున్నారనే కామెంట్ వినిపిస్తోందిప్పుడు!